చెన్నై: పిరియడ్స్ వచ్చిన విద్యార్థినిని క్లాస్ బయట పరీక్ష రాయించారు. (exam outside classroom) ఈ విషయం తెలిసి ఆ బాలిక తల్లి స్కూల్‌కు చేరుకున్నది. ఈ అమానుషంపై స్కూల్ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆమె రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెంగుట్టైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 8వ తరగతి విద్యార్థిని రుతుక్రమంలో ఉన్నట్లు స్కూల్ సిబ్బందికి తెలిసింది. దీంతో ఆమెను క్లాస్ రూమ్ బయట విడిగా కూర్చోమని చెప్పారు. ఆ విద్యార్థినితో అక్కడ పరీక్ష రాయించారు.
కాగా, ఆ బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె ఆ స్కూల్‌కు చేరుకున్నది. పిరియడ్స్ వచ్చిన తన కుమార్తెను క్లాస్ బయట విడిగా కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుండటం చూసి కలత చెందింది. ఇలా ఎలా చేస్తారంటూ స్కూల్ సిబ్బందిని ప్రశ్నించింది. ఈ అమానుషానికి పాల్పడిన స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స్కూల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.