న్యూఢిల్లీ: రైళ్లలో సీనియర్ సిటీజన్లకు రాయితీ(Railways Concession)ని పునరుద్దరించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ వల్ల మార్చి 20, 2020 నుంచి సీనియర్ సిటీజన్లకు ఆ రాయితీని ఎత్తివేశారు. అప్పటి నుంచి సీనియర్ సిటీజన్ల క్యాటగిరీలో, అంటే గత అయిదేళ్లలో రైల్వే శాఖకు అదనంగా 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డేటా నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. రైల్వేశాఖకు చెందిన టికెట్లు, ప్రయాణికుల వివరాలను సీఆర్ఐఎస్ మెంటేన్ చేస్తుంది.
రైల్వే శాఖ ప్రతి ప్రయాణికుడిపై 46 శాతం రాయితీ ఇస్తోందని మంత్రి అశ్వీని వైష్ణవ్ వెల్లడించారు. 2020, మార్చి 20 కన్నా ముందు.. రైల్వే టికెట్లపై 60 ఏళ్లు నిండిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40 శాతం రాయితీ, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ కల్పించేవారు. సీఆర్ఐఎస్ డేటా ప్రకారం మార్చి 20, 2020 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు 31.25 కోట్ల మంది సీనియర్ సిటీజన్లు రైళ్లలో ప్రయాణించారు. రాయితీ ఎత్తివేయడం వల్ల ఆ ప్రయాణికుల నుంచి రూ. 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది.
గత అయిదేళ్లలో 18.2 కోట్ల మంది పురుషులు, 13.06 కోట్ల మంది మహిళలు, 43 వేల మంది ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు సీనియర్ సిటిజన్ కోటాలో ప్రయాణించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ వేసిన పిటీషన్ ఆధారంగా ఈ సమాచారం బహిర్గతమైంది. పురుష ప్రయాణికుల ద్వారా 11,531 కోట్లు, మహిళా ప్రయాణికుల ద్వారా 8,599 కోట్లు ట్రాన్స్జెండర్ల ద్వారా 28 లక్షల ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఆదాయం 29 వేల కోట్లు దాటింది. అయితే పురుషులకు చెందిన 40 శాతం, మహిళలకు చెందిన 50 శాతం రాయితీ తీస్తే ఆ మొత్తం అమౌంట్ నుంచి 8913 కోట్లు సీనియర్ సిటీజన్ కోటా నుంచి వచ్చినట్లు అవుతుందని చంద్రశేఖర్ తెలిపాడు.