Harry Brook : ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్(Harry Brook) భారత అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్ 16వ సీజన్లో తాను చేసిన ఇండియన్ ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్‌కు బాధపడుతున్నాని బ్రూక్ తెలిపాడు. 2023 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad)కు ఆడిన బ్రూక్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkat Knight Riders)పై సెంచరీ బాదిన అనంతరం.. ‘ఇండియన్ ఫ్యాన్స్ నోళ్లు మూయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఇంటర్వ్యూలో అన్నాడు. అప్పట్లో అతడి వ్యాఖ్యలపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే.. ఐపీఎల్ 17వ సీజన్ వేలానికి ముందు బ్రూక్ తాజాగా తన వ్యాఖ్యలపై స్పందించాడు. ‘ఇండియన్ ఫ్యాన్స్ నోళ్లు మూయించాను అని అన్నందుకు సారీ చెప్తున్నా. నేనొక ఇడియట్. ఇంటర్వ్యూలో చెత్త చెత్తగా వాగాను. అందుకు ఇప్పుడు బాధపడుతున్నా’ అని బ్రూక్ పేర్కొన్నాడు. మినీ వేలానికి12 రోజుల ముందు బ్రూక్ భారత అభిమానులకు క్షమాపణలు చెప్పడం గమనార్హం.
ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ టూర్లో దంచికొట్టిన హ్యారీ బ్రూక్ 16వ సీజన్ మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టాడు. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్‌ను రూ.13.25 కోట్లకు కొన్నది. అయితే. ఈ స్టార్ బ్యాటర్ ఒక సెంచరీతో ఆశలు రేపినా.. ఆ తర్వాత వరుసగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఓపెనర్, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని కోట్లు ముట్టజెప్పిన ఫ్రాంచైజీని నట్టేట ముంచాడు. బ్రూక్ 11 మ్యాచుల్లో కేవలం 190 పరుగులు చేశాడంతే. దాంతో, 17 వ సీజన్‌కు ముందు హైదరాబాద్ అతడిని వదిలించుకుంది. ఈసారి మినీ వేలంలో బ్రూక్ రూ.2 కోట్ల కనీస ధరకు తన పేరు రిజిష్టర్ చేసుకున్నాడు.