INDW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులను భయపెడుతూ వస్తున్న ఆస్ట్రేలియాకు భారత జట్టు ముచ్చెమటలు పట్టించింది. విధ్వంసక బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్‌ను 155 లోపే కట్టడి చేసింది. పవర్ ప్లేలోనే రేణుకా సింగ్(2/24) విజృంభణతో ఒత్తిడిలో పడిన కంగారూ జట్టు.. వందకొట్టడం కష్టమే అనిపించింది. కానీ.. భారత బౌలర్ల లయను దెబ్బతీస్తూ గ్రేస్ హ్యారిస్(40), తహ్లియా మెక్‌గ్రాత్(32)లు బౌండరీలు సాధించారు. హ్యారిస్ జతగా ఎలీసా పెర్రీ(32)లు దూకుడుగా ఆడింది. దాంతో, ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
పాకిస్థాన్, శ్రీలంకపై విజయోత్సాహంతో భారత్.. ఆస్ట్రేలియా సవాల్‌కు సిద్ధమైంది. అందుకు తగ్గట్టే పేసర్ రేణుకా సింగ్(2/24) తన రెండో ఓవర్లోనే తడాఖా చూపిస్తూ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టింది. ఓపెనర్ బేత్ మూనీ(2), జార్జియా వరేహమ్(0)లను ఔట్ చేసి శుభారంభం ఇచ్చింది. ఆ తర్వాత గ్రేస్ హ్యారిస్(40), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్(32)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకొని ఆచితూచి ఆడుతున్నారు. దాంతో, ఆస్ట్రేలియా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
పవర్ ప్లేలో నత్తనడకలా సాగిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆ తర్వాత వేగం అందుకుంది. ఒత్తిడిని ఊదేస్తూ హ్యారిస్ గేర్ మార్చింది. భారీ షాట్లతో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ఉరికించింది. ప్రమాదకరంగా మారిన ఆమెను దీప్తి శర్మ ఔట్ చేసి ఆసీస్ వేగానికి కళ్లెం వేసింది. ఆ తర్వాత ఎలీసా పెర్రీ(32), అష్ గార్డ్నర్(6)లు .. ధాటిగా ఆడారు. అయితే.. పూజా వస్త్రాకర్ షార్ట్ పిచ్ బంతితో గార్డ్నర్ను బోల్తా కొట్టించింది. అంతే.. 101 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయింది.
Putting her hand up for Australia since 2007 🙇
FOLLOW: https://t.co/tPPpAyLqTy | #T20WorldCup pic.twitter.com/dE7sKQU1pJ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2024
కానీ.. 16వ ఓవర్లో పెర్రీ రెచ్చిపోయింది. శ్రేయాంక వేసిన ఆ ఓవర్లో వరుసగా 4, 6 బాదేసి తన ఉద్దేశాన్ని చాటింది. మరోవైపు ఫొబే లిచ్‌ఫీల్డ్(15) సైతం భారీ బౌండరీతో దీప్తికి స్వాగతం పలికి.. ఆ తర్వాతి బంతికే ఎల్బీ అప్పీల్ నుంచి బతికిపోయింది. పెర్రీ ఔటైనా లిచ్‌ఫీల్డ్, అనాబెల్ సథర్లాండ్ (10)లు దూకుడు కొనసాగించారు. అయితే.. శ్రేయాంక 19వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ 151 పరుగులకే పరిమితమైంది.