దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్గేట్ వద్ద 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో దుద్దెడ టోల్‌గేట్‌ను ఎత్తివేశారు. ఎలాంటి టోల్ వసూలు చేయకుండానే వాహనాలను అనుమతిస్తున్నారు. విజయవాడ- హైదరాబాద్ హైవేలోని చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ గేట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గల యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్గేట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.