గౌహతి: కొందరు ఖైదీలు పెద్ద సాహసం చేశారు. జైలు ఊచలు విరగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, లుంగీలను తాడుగా చేశారు. 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలిసి జైలు అధికారులు షాక్ అయ్యారు. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Assam Prison break) అక్టోబర్ 11న తెల్లవారుజామున ఐదుగురు ఖైదీలు జైలు రాడ్డు పగులగొట్టి బయటపడ్డారు. బెడ్షీట్లు, దుప్పట్లు, లుంగీలు ఉపయోగించి 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు.
కాగా, జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలను సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్లుగా గుర్తించారు. సోనిత్పూర్ జిల్లాలోని తేజ్పూర్, మోరిగావ్ జిల్లాలోని లాహోరీఘాట్, మొయిరాబారి నివాసితులైన ఈ ఐదుగురు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అరెస్టై అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జైలర్ ప్రశాంత సైకియాను సస్పెండ్ చేశారు. పారిపోయిన ఖైదీలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.