న్యూఢిల్లీ: ఈనెల 27వ తేదీ నుంచి శ్రీలంకతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే టీ20 సిరీస్ తర్వాత లంకతోనే జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు పాండ్యా దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆగస్టులో జరగనున్న వన్డే సిరీస్‌కు పాండ్యా దూరంగా ఉంటారని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది.
రోహిత్ నేతృత్వంలోని టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా చేశాడని, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, మూడు టీ20లకు అందుబాటులో ఉంటాడని, ఆ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపడుతాడని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు ఇవాళ తెలిపారు. వెస్టిండీస్‌లో జరిగిన వరల్డ్‌కప్ తర్వాత టీ20 క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
జూలై 27 నుంచి 30 వరకు పల్లెకిలో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఆగస్టు 2 నుంచి 7 వరకు కొలంబోలో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు చెందిన బృందాలను త్వరలో ప్రకటించనున్నారు. టీ20లకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్ లేదా సూర్యకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వన్డేలకు రోహిత్, పాండ్యా దూరంగా ఉండనున్న నేపథ్యంలో.. కేఎల్ రాహుల్ లేదా గిల్‌కు బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి.