లక్నో: ఐపీఎల్(IPL 2025)లో ముంబై మళ్లీ ఓడింది. నాలుగు మ్యాచుల్లో ఆ జట్టు మూడో ఓటమి చూవిచూసింది. లక్నో చేతిలో శుక్రవారం 12 రన్స్ తేడాతో ఆ జట్టు పరాజయం పాలైంది. అయితే ఛేజింగ్‌లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ .. రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. మరో 7 బంతుల్లో 24 రన్స్ చేయాల్సి ఉన్న దశలో అతను రిటైర్డ్ హార్ట్‌గా వెళ్లిపోయాడు. అప్పటికే తిలక్ వర్మ 23 బంతుల్లో 25 రన్స్ మాత్రమే చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై .. తిలక్ వర్మ వేగంగా స్కోర్ చేయలేకపోయాడు. దీంతో అతను రిటైర్డ్ హార్ట్ అయినట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్ తర్వాత ఆ నిర్ణయం గురించి పాండ్యా వెల్లడించాడు.
వేగంగా స్కోర్ చేసే బ్యాటర్ కావాలి అని, కొన్ని సందర్భాల్లో క్రికెట్లో అలాంటి పరిస్థితి వస్తుందన్నాడు. కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా.. పరుగులు చేయడం ఇబ్బందిగా మారుతుందని హార్దిక్ తెలిపాడు. లక్నో బౌలర్ దిగ్వేశ్ రాతీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబైకి పరుగులు రాబట్టడం ఇబ్బందిగా మారింది. దిగ్వేశ్ 4 ఓవర్లలో 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంకా కీలకమైన నమన్ ధిర్ వికెట్‌ను తీశాడతను.
ఓ బ్యాటింగ్ బృందంగా తాము విఫలమైనట్లు హార్దిక్ తెలిపాడు. జట్టుగా గెలుస్తామని, జట్టుగా ఓడిపోతామని, ఒకర్ని వేలి ఎత్తి చూపడం లేదని, బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఆ బాధ్యత తీసుకోవాలని, తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు పాండ్యా చెప్పాడు. ఓటమి ఎదుర్కొన్నపుడు నిరాశగా ఉంటుందని, నిజం చెప్పాలంటే ఫీల్డింగ్‌లో 15 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నామని తెలిపాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో పాండ్యా అయిదు వికెట్లు తీసుకున్నాడు. కానీ జట్టును గెలిపించడంలో విఫలం అయ్యాడు. అయిదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు.. బౌలింగ్ అంశంలో స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని విధ్వంసక ప్రయత్నాలు చేయాలన్నాడు. నేనెప్పుడూ బౌలింగ్ ఎంజాయ్ చేస్తానని, నా దగ్గర ఎక్కువ ఆప్షన్లు ఉండవని, వికెట్‌ను అంచనా వేసి దానికి తగినట్లు బౌలింగ్ చేస్తానని, వికెట్లు తీసుకోవాలన్న కసితో కాకుండా, బ్యాటర్‌ను కట్టడి చేసే విధంగా బౌలింగ్ చేస్తానని పాండ్యా తెలిపాడు.
చాలా సింపుల్ క్రికెట్ ఆడాలని, బౌలింగ్‌లో స్మార్ట్‌గా వ్యవహరిస్తూ, బ్యాటింగ్‌లో సాహసం ప్రదర్శించాలన్నాడు. కొంత దూకుడుగా ఆడాలన్నాడు. టోర్నీ చాలా సుదీర్ఘమైందని, రెండు విక్టరీలు సాధిస్తే, మళ్లీ గాడిలో పడుతామని హార్దిక్ తెలిపాడు.
ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ హార్ట్ అయిన నాలుగవ బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.