రాజ్‌కోట్: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్మురేపాడు. విజయ్ హజారే టోర్నీలో విదర్భతో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాండ్యా(92 బంతుల్లో 133, 8ఫోర్లు, 11సిక్స్‌లు) విజృంభించాడు. హార్దిక్ సెంచరీ కొట్టినా..విదర్భ చేతిలో 9 వికెట్ల తేడాతో బరోడా ఓటమిపాలైంది. తొలుత బరోడా 50 ఓవర్లలో 293/9 స్కోరు చేసింది.
71/5స్కోరుతో ఓ దశలో కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ ఆదుకున్నాడు. స్పిన్నర్ పార్థ్ రేఖడే వేసిన 39వ ఓవర్లో పాండ్యా వరుసగా ఐదు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 68 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యఛేదనలో అమన్ మోఖడే(150 నాటౌట్) భారీ సెంచరీతో విదర్భ 41.4 ఓవర్లలో 296/1 స్కోరు చేసింది. మరోవైపు వేర్వేరు మ్యాచ్‌ల్లో శాంసన్, పడిక్కల్, అక్షర్‌పటేల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.