Mumbai Indians | ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో కీలక మార్పు జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ ఫ్రాంచైజీ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత రెండేండ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్ పంచుకుంది. అయితే ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది.
ముంబై ఇండియన్స్ జట్టు అఫీషియల్ ‘ఎక్స్’ పేజీని గంటలోపే 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు (franchise loses 400k followers). దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్‌ను టీమ్ కోల్పోయింది. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని కొందరు ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీపై సోషల్‌మీడియాలో అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ‘జట్టుకోసం ఎంతో కష్టపడి.. అద్భుతమైన ఫలితాలు అందించిన రోహిత్‌కు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా’ అంటూ మండిపడుతున్నారు. ‘నా గుండె బద్దలైంది. ఏదేమైనప్పటికీ మా కెప్టెన్‌వి నీవే రోహిత్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా రోహిత్ శర్మ 2013 నుంచి ఈ ఏడాది సీజన్ 2023 వరకు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో 5 సార్లు టైటిళ్లు గెలిపించారు. ముంబైతో రోహిత్12 ఏండ్ల అనుబంధానికి తాజాగా ముగింపు పడింది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, హర్భజన్‌సింగ్ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని ముంబైకి టైటిల్ కరువును రోహిత్‌శర్మ వచ్చి రావడంతోనే తీర్చేశాడు. తన అద్భుత నాయకత్వ పటిమతో పదేండ్ల కాలంలో ముంబైకి ఐదు ఐపీఎల్ టైటిళ్లతో పాటు చాంపియన్స్‌లీగ్ విజేతగా నిలిపి ఔరా అనిపించాడు. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ముంబైకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన రోహిత్‌ను ఫ్రాంచైజీ పక్కకు తప్పిస్తూ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. కాగా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తిరిగి వచ్చే సీజన్లో ముంబైకి ఆడబోతున్నాడు.
Also Read..
Ukraine: మీటింగ్‌లో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిలర్.. ఉక్రెయిన్‌లో 26 మందికి గాయాలు.. వీడియో
Cricketers Jerseys | ప్రపంచ క్రికెట్లో ఈ జెర్సీలు చాలా స్పెషల్.. ఎవరెవరివో తెలుసా..?
Ratan Tata: రతన్ టాటాను బెదిరించిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు