Cricketers Jerseys : ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్రవేసిన ఆటగాళ్లు చాలామందే. ఒకరు పరుగుల వరద పారిస్తే.. మరొకరు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో పాపులర్ అయ్యారు. ఇక కొందరేమో కూల్ కెప్టెన్సీతో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపారు. తమ ప్రతిభతో ఆటకు వన్నె తేవడంతో పాటు దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన ఆ దిగ్గజాలను ఆయా క్రికెట్ బోర్డులు(Cricket Boards) గొప్పగా గౌరవించాయి. ఆ క్రికెటర్ల జెర్సీల(Jersey)ను మరొకరికి కేటాయించకుండా వీడ్కోలు పలికాయి.
భారత క్రికెట్ బోర్డు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) ఏడో నంబర్ జెర్సీకి గుడ్ బై చెప్పింది. దాంతో ఈ గౌరవం అందుకున్న రెండో భారత ఆటగాడిగా మహీ భాయ్ రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 10వ నంబర్ జెర్సీకిబీసీసీఐ గుడ్ బై చెప్పింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఈ గౌరవం పొందిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అత్యధికంగా ఏడుగురు ఆటగాళ్ల జెర్సీలకు వీడ్కోలు పలికింది. స్టార్ స్పిన్నర్ డేనియల్ వెటోరి (11), మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్(7), విధ్వంసక ఓపెనర్ బ్రెండన్ మెక్కల్లమ్(42), క్రిస్ హ్యారిస్(5), రాస్ టేలర్(3), నాథన్ అస్ట్లే(9), క్రిస్ క్రెయిన్స్(6) జెర్సీలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పక్కన పెట్టేసింది.
మెక్కల్లమ్, డేనియల్ వెటోరి
ఇక ఆస్ట్రేలియా బోర్డు దివంగత ఫిలిప్ హ్యూస్(64) జెర్సీకి ఈ గౌరవం కల్పించింది. బ్యాటింగ్ చేస్తుండగా తలకు బంతి తగిలి హ్యూస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతడి మరణాంతరం ఆస్ట్రేలియా బోర్డు 64 నంబర్ జెర్సీకి వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకుంది. నేపాల్ బోర్డు కూడా స్టార్ ఆటగాడు పరాస్ ఖడ్కా 77వ నంబర్ జెర్సీకి గుడ్ బై చెప్పేసి అతడిని గౌరవించింది.