ముంబై: వ్యాపారవేత్త రతన్ టాటా(Ratan Tata)ను బెదిరించిన వ్యక్తి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఆ బెదిరింపు కాల్ చేసింది ఎంబీఏ చదువుకున్న వ్యక్తి అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తికి సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వివరాళ్లోకి వెళ్తే.. రతన్ టాటాకు సెక్యూర్టీని పెంచాలని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. సెక్యూర్టీ పెంచని పక్షంలో.. టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ తరహాలో రతన్ టాటాకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు ఆ వ్యక్తి ఫోన్లో బెదిరించాడు. ఆ ఫోన్ కాల్‌తో ముంబై పోలీసులు అలర్ట్ మోడ్‌లోకి వెళ్లారు. రతన్ టాటాకు ప్రత్యేక సెక్యూర్టీని ఏర్పాటు చేశారు.
టెక్నికల్ సపోర్ట్ బృందం ద్వారా ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆధారాలను సేకరించారు. ఆ వ్యక్తి కర్నాటకలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను పుణెకు చెందిన వ్యక్తి అని తేల్చారు. పుణెలో అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతను 5 రోజుల నుంచి మిస్సింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
బోసారి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి ఇంట్లోనే మరో వ్యక్తికి చెందిన ఫోన్‌ను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ ఫోన్‌తోనే ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి.. రతన్ టాటాను బెదిరించాడు. బెదిరింపు కాల్ చేసిన నిందితుడు ఎంబీఏ చేశాడు. ఇంజినీరింగ్ కూడా చదివాడు.