టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు.
కింగ్ వికెట్ టీ20లలో హార్దిక్‌కు 50వది. ఈ క్రమంలో టీమిండియా తరఫున టీ20లలో 500+ పరుగులు, 50 వికెట్లు తీసిన ఆటగాడిగా పాండ్యా ఘనత సాధించాడు. గతంలో అశ్విన్, జడేజాలు కూడా 50+ వికెట్లు తీసినప్పటికీ ఇంకా వాళ్ల స్కోరు 500 దాటలేదు. పాండ్యాకు సమీపంలో రవీంద్ర జడేజా (50 వికెట్లు, 422 పరుగులు) మాత్రమే ఉన్నాడు.
భారత్ తరఫున వినూ మాన్కడ్ టెస్టులలో ఈ ఘనత (500+ పరుగులు, 50+ వికెట్లు) సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. వన్డేలలో ఈ రికార్డు కపిల్ దేవ్ అందుకున్నాడు. టీ20లలో మాత్రం ఈ రికార్డు హార్దిక్ పేరిట లిఖితమైంది.
ఇక ప్రపంచ క్రికెట్లో చూస్తే ఈ రికార్డు సాధించిన 11వ క్రికెటర్ హార్దిక్. ఈ జాబితాలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ (99 మ్యాచ్‌లలో 2,010 పరుగులు, 121 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్), డ్వేన్ బ్రావో, డాక్రెల్ (ఐర్లాండ్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్)లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. యాభై వికెట్లు తీసిన పాండ్యా.. పొట్టి ఫార్మాట్లో 806 పరుగులు చేశాడు.