దుబాయ్: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో పాటు.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత దాదాపు రెండేండ్లుగా హార్దిక్ బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘హార్దిక్ బౌలింగ్ చేయకపోవడం ముంబైతో పాటు భారత్‌కు ఎదురుదెబ్బ. అతడికి ఆల్‌రౌండర్‌గానే జట్టులో చోటు దక్కింది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడటంతో పాటు పేస్ బౌలింగ్ చేయగలగడమే అతడి బలం. అలాంటప్పుడు బౌలింగ్ చేయలేకపోతే ఏ కెప్టెన్‌కైనా ఇబ్బందే’ అని పేర్కొన్న్నాడు. ఇక యువ ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఫామ్‌పై స్పందిస్తూ.. భారత జట్టుకు ఎంపికైన తర్వాత వారిద్దరు కాస్త రిలాక్స్ అయినట్లు కనిపిస్తున్నదని అన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లో అంపైరింగ్ ప్రమాణాలు స్థాయికి తగ్గట్లు లేవన్న సన్నీ.. తరచూ తప్పుడు నిర్ణయాలు ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని చురకలంటించాడు.