IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023) రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు దగ్గరపడడంతో అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆఖరి ఓవర్ ఉత్కంఠ ఫ్యాన్స్‌ను కావాల్సినంత మజాను ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. ఏ జట్లు ప్లే ఆఫ్స్ చేరాతాయో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) చెప్పేశాడు . డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chenani Super Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్లే ఆఫ్స్‌లో ఎదురుపడతాయని ఆయన జోస్యం చెప్పాడు.
పదిహేనే సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఛాన్స్ ఉందని, అయితే.. రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదుసార్లు చాంపియన్ ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందని భజ్జీ అన్నాడు. ఆఫ్ స్పిన్నర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్భజన్ సింగ్ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం ఈసీజన్లో అతను కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ప్రస్తుత సీజన్లో అదరగొడుతోంది. ఛేజ్ మాస్టర్‌గా తన సత్తా చాటుతోంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నారు. షమీ, జోష్ లిటిల్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. దాంతో, హార్దిక్ పాండ్యాసేన ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ 5 విజయాలతో మూడో ప్లేస్ దక్కించుకుంది. మొదట్లో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. 5 మ్యాచులు గెలిచిన ఆర్సీబీ ఐదో స్థానం సొంతం చేసుకుంది. అయితే.. లీగ్ దశలో మరిన్ని మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.