టీమిండియా ఎంపికలో కీలక భూమిక పోషించేంది సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ నిర్ణయాల్లో బీసీసీఐ వేలు పెట్టకూడదు. కానీ ఒక బీసీసీఐ అధికారి సెలక్షన్ మీటింగ్స్‌లో పాల్గొనేవాడని, అతను కూడా తన నిర్ణయాలను చెప్పేవాడని ప్రముఖ జర్నలిస్టు కె. శ్రీనివాస రావు తాజాగా ఒక ట్వీట్ చేశారు.
సెలక్షన్ మీటింగుల నుంచి దూరంగా ఉండాలని తెలిసి కూడా సదరు బీసీసీఐ అఫీషియల్ ఆ పని చేయలేదని, మీటింగ్స్‌లో పాల్గొన్నాడని ఆయన తెలియజేశారు. దీంతో భారత క్రికెట్ అభిమానులందరిలో సదరు బీసీసీఐ అధికారి ఎవరనే ప్రశ్న మెదిలింది.
ఇదే ప్రశ్న వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కూడా పట్టిపీడించింది. దీంతో ఉండబట్టలేని అతను ట్విట్టర్ వేదికగా శ్రీనివాసరావును అడిగేశాడు. ‘ఇదంతా మీకెలా తెలుసు? అలాగే ఆ అధికారి ఎవరు?’ అనడిగాడు.
దీనికి బదులిచ్చిన సదరు జర్నలిస్టు.. ‘‘ఇదే ప్రశ్ర విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, బీసీసీఐ లేదంటే సెలక్టర్లను అడగండి. వారిలో కొంతమందైనా విషయం చెప్పడానికి వెనకాడరు’’ అని సలహా ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఇది క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.