జైపూర్: ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన దశలో గుజరాత్ టైటాన్స్(జీటీ) టాప్ గేరులో దూసుకెళ్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84) మెరు పు బ్యాటింగ్‌కు తోడు రషీద్ ఖాన్ (4/33) స్పిన్ మ్యాజిక్ చేయడంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలిచి రెండో ప్లేస్‌కు దూసుకొచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 77 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. గిల్, సాయి సుదర్శన్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో55) ఫిఫ్టీలతో రాణించడంతో తొలుత జీటీ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో రాయల్స్ 16.3 ఓవర్లలో152కే ఆలౌటై ఐదో ఓటమి మూటగట్టుకుంది. జడేజా (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38), వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) పోరాడారు. హోల్డర్ (3/12) మూడు వికెట్లు తీశాడు. రషీద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఓపెనర్లు సుదర్శన్- గిల్ పవర్ ప్లేలో దంచికొట్టడంతో టైటాన్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగు వైడ్స్, నోబాల్‌తో కలుపుకుని 18 రన్స్ టైటాన్స్ ఖాతాలో చేరాయి. బ్రిజేష్ రెండో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో బాదుడుకు శ్రీకారం చుట్టిన సాయి.. ఆ వెంటనే దేశ్పాండేనూ అలాగే శిక్షించాడు. ఆర్చర్ ఐదో ఓవర్లో 4, 6, 4తో గిల్ సైతం జోరందుకోవడంతో పవర్ ప్లేలో జీటీ 82/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. 30 బంతుల్లో సాయి అర్ధ శతకం పూర్తవగా.. పదోఓవర్లో సింగిల్‌తో గిల్ కూడా ఈ సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే ఇదే ఓవర్లో సాయి.. లాంగాన్‌లో ఆర్చర్‌కు క్యాచ్ ఇవ్వడంతో 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చి సిక్స్, ఫోర్‌తో టచ్‌లో కనిపించిన బట్లర్ (13)ను జడేజా వెనక్కి పంపాడు. అయినా సుందర్ (37 నాటౌట్)తో కలిసి మరింత ధాటిగా ఆడేందుకు యత్నించిన గిల్.. చూడచక్కని షాట్లతో అలరించినా బ్రిజేష్ 17వ ఓవర్లో తుషార్‌కు క్యాచ్ ఇవ్వడంతో టైటాన్స్ స్పీడు తగ్గింది. ఒకదశలో 250 ప్లస్ స్కోరు చేస్తుందనుకున్న ఆ జట్టు.. ఆఖర్లో తడబడ్డా సుందర్, తెవాటియా (14 నాటౌట్) మెరుపులతో భ్రారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఛేదనలో ఎప్పట్లాగే సూర్యవంశీ బ్యాట్‌కు పనిచెప్పడటంతో రాయల్స్ ఇన్నింగ్స్ ధాటిగానే మొదలైంది. ఆ సీజన్లో నాలుగోసారి సిక్స్‌తో ఖాతా తెరిచిన ఈ వండర్ కిడ్.. సిరాజ్, రబాడ బౌలింగ్‌లో భారీ షాట్లతో అలరించాడు. కానీ, మూడో ఓవర్లో సిరాజ్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి ఫైన్ లెగ్ వద్ద అర్షద్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే రబాడ.. స్టాండిన్ కెప్టెన్ జైస్వాల్ (3)ను ఔట్ చేయగా హెట్మయర్ (6) సైతం నిరాశపరిచాడు. జురెల్ (24).. సిరాజ్ ఐదో ఓవర్లో 6, 4, 6, 6తో 22 రన్స్ రాబట్టడంతో ఆ జట్టు ఛేదన దిశగా సాగుతున్నట్టే కనిపించింది.
కానీ 8వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన రషీద్ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. జురెల్‌తో పాటు హార్డ్ హిట్టర్ ఫెరీరా (4)నూ క్లీన్‌బౌల్డ్ చేసి రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. తన తర్వాతి ఓవర్లో శుభం దూబే (15)ను కూడా బౌల్డ్ చేసిన రషీద్.. ఒంటరిపోరాటం చేస్తున్న జడేజాను ఏడో వికెట్‌గా ఎల్బీ చేయడంతో రాయల్స్ ఓటమి ఖాయమైంది. హోల్డర్ మిగిలిన ముగ్గురి పని పట్టాడు.
టీ20 క్రికెట్లో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా, ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా 15 ఏళ్ల సూర్యవంశీ రికార్డుకెక్కాడు. 515 బంతుల్లో అతను ఈ మార్కు అందుకొని కరణ్‌బీర్ సింగ్ (813 బంతులు) రికార్డు బ్రేక్ చేశాడు.
గుజరాత్: 20 ఓవర్లలో 229/4 (గిల్ 84, సుదర్శన్ 55, బ్రిజేష్ 2/47, యశ్‌రాజ్ 1/37);
రాజస్థాన్: 16.3 ఓవర్లలో152 ఆలౌట్ (జడేజా 38, సూర్యవంశీ 36, రషీద్ 4/33)
