అహ్మదాబాద్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించి టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు చెక్ పెట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-19లో మరో హ్యాట్రిక్ సాధించింది. శనివారం రాత్రి సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో జీటీ 4వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచి ఓవరాల్‌గా ఆరో విజయం సొంతం చేసుకుంది. తొలుత కింగ్స్ 20 ఓవర్లలో 163/9 స్కోరు చేసింది. టాప్-5 బ్యాటర్లు విఫలమవడంతో ఓ దశలో 47/5తో నిలిచిన జట్టును సూర్యాంశ్ షెడ్గే (39 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సర్లతో 57), మార్కస్ స్టోయినిస్ (31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో40) ఆదుకున్నారు. జేసన్ హోల్డర్ (4/24), కగిసో రబాడ (2/22) మహ్మద్ సిరాజ్ (2/28) సత్తా చాటారు. అనంతరం ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌తో 57), వాషింగ్టన్ సుందర్ ( 23 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌తో 40 నాటౌట్) మెరుపులతో జీటీ 19.5 ఓవర్లలో 167/6 స్కోరు చేసి గెలిచింది.
భారీ టార్గెట్లను అలవోకగా ఛేదిస్తున్న పంజాబ్‌ను ఈ మ్యాచ్‌లో టైటాన్స్ బౌలర్లు వణికించారు. సిరాజ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ ప్రియాంశ్ (2), కనోలి (0)ని పెవిలియన్ చేర్చి ష్రాకిచ్చాడు. రబాడ కూడా పదునైన బంతులు వేయడంతో పవర్‌ప్లేలో పంజాబ్ ఇబ్బంది పడింది. ఆరో ఓవర్లో 152 కి.మీ బంతితో ప్రభ్‌సిమ్రన్ (15)ను ఔట్ చేసిన రబడా పవర్ ప్లేలో ప్రత్యర్థిని 35/3తో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత హోల్డర్ హవామొదలైంది. వరుస ఓవర్లలో వాధెరా (0), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) పని పట్టడంతో 50 పరుగులు చేరేలోపే పంజాబ్ సగం వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో సూర్యాంశ్, స్టోయినిస్ ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. క్రమం తప్పకుండా బౌండరీలు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. అర్షద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో మార్కస్ తొలి సిక్స్ రాబట్టగా..మానవ్ సుతార్ వేసిన తర్వాతి ఓవర్లో సూర్యాంశ్ 6,6,4,4,6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. అదే జోరుతో తను లీగ్‌లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకొని రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోఎండ్‌లో భారీ షాట్లు కొడుతున్న మార్కస్‌ను హోల్డర్ పెవిలియన్ చేర్చగా.. చివరి ఓవర్లో మార్కో యాన్సెన్ (20) 6,4 కొట్టి పంజాబ్ స్కోరు 160 మార్కు దాటించాడు.
లక్ష్య ఛేదనలో రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5)ను అర్ష్‌దీప్ ఔట్ చేసినా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. పవర్‌ప్లేలో అతనికి బట్లర్ (26) మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో జీటీ 58/1 స్కోరు చేసింది. ఆ తర్వాత బట్లర్‌ను ఔట్ చేసిన వైశాక్, నిశాంత్ సంధు (15)ను పెవిలియిన్ చేర్చిన స్టోయినిస్‌తో పాటు యాన్సెన్, అర్ష్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో టైటాన్స్ రన్‌రేట్ మందగించింది.
ఓదశలో 28 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. కానీ, సుందర్‌తో కలిసి సుదర్శన్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. చహల్ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, సుదర్శన్‌తో పాటు తెవాటియా (2), హోల్డర్ (5) ఔటవడంతో చివర్లో ఉత్కంఠ రేగింది. ప్రశాంతంగా ఆడిన సుందర్ ఆఖరి ఓవర్లో సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.
పంజాబ్: 20 ఓవర్లలో 163/9 (సూర్యాంశ్ షెడ్గే 57 స్ట్టోయినిస్ 40, హోల్డర్ 4/24,సిరాజ్ 2/28);
గుజరాత్: 19.5 ఓవర్లలో 167/6 (సుదర్శన్ 57, సుందర్ 40* , అర్ష్‌దీప్ 2/24)
