ఇటీవలే ఢిల్లీ చేతిలో అవమానకర ఓటమి మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ పుంజుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ దంచేసింది. టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ నాలుగు వికెట్లతో చెలరేగి పంజాబ్‌ను కోలుకోనీయకుండా చేశాడు. బ్యాటింగ్‌లో గిల్, సుదర్శన్‌లు బాధ్యతా యుతంగా ఆడితే ఆఖర్లో తెవాటియా ఫినిషింగ్ టచ్ ఇచ్చి టైటాన్స్‌ను గెలిపించారు. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇది నాలుగో విజయం కాగా పంజాబ్‌కు ఐదో పరాజయం.
ముల్లాన్‌పూర్: సొంత గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్నా పంజాబ్ కింగ్స్ మాత్రం ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్‌ను గుజరాత్ 3 వికెట్ల తేడాతో చిత్తుచేయడంతో ఆ జట్టు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. టైటాన్స్ స్పిన్నర్ సాయికిషోర్ (4/33), నూర్ అహ్మద్ (2/20) స్పిన్ మాయాజాలంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ (21 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్ తెవాటియా (18 బంతుల్లో 36 నాటౌట్, 7 ఫోర్లు), ఆ జట్టు సారథి శుభ్‌మన్ గిల్ (29 బంతుల్లో 35, 5 ఫోర్లు) రాణించారు. పంజాబ్ పతనాన్ని శాసించిన సాయికిషోర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు కెప్టెన్ సామ్ కరన్ (19 బంతుల్లో 20, 2 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌లు శుభారంభమే అందించారు. సందీప్ వారియర్ రెండో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ మూడు బౌండరీలు ఓ సిక్సర్ సాయంతో 21 పరుగులు రాబట్టాడు. మోహిత్ శర్మ ఆరో ఓవర్లో ఈ జోడీని విడదీసి 52 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత స్పిన్నర్ల రాకతో పంజాబ్ కోలుకోలేదు. రూసో (9)ను నూర్ అహ్మద్ ఔట్ చేయగా జితేశ్ శర్మ (13)ను సాయి బౌల్డ్ చేశాడు. పంజాబ్ భారీ ఆశలు పెట్టుకున్న లివింగ్‌స్టోన్ (6) అహ్మద్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇవ్వగా ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న శశాంక్ సింగ్ (8), అశుతోష్ శర్మ (3)లను సాయి బోల్తా కొట్టించాడు ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రర్ (12 బంతుల్లో 29, 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బ్రర్ వికెట్ కూడా సాయికే దక్కింది.
స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (11 బంతుల్లో 13, 1 ఫోర్), గిల్ తొలి వికెట్ కు 66 పరుగులు జోడించారు. సాహా విఫలమైనా గిల్ ఫోర్లతో అలరించాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔట్ అయినా, డేవిడ్ మిల్లర్ (4) కూడా నిష్క్రమించినా సాయి సుదర్శన్ నిలకడగా ఆడుతూ టైటాన్స్‌ను లక్ష్యాన్ని దగ్గర చేశాడు. అయితే కరన్.. సుదర్శన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం, అజ్మతుల్లా ఒమర్జయ్ (13)ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో పంజాబ్ పోటీలోకి వచ్చినట్టే కనిపించింది. కానీ ‘ఫినిషర్’ రాహుల్ తెవాటియా మాత్రం పంజాబ్‌కు ఆ అవకాశమివ్వలేదు. బ్రర్ 17వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతడు.. రబాడా 18వ ఓవర్లో మూడు బౌండరీలతో టైటాన్స్ గెలుపును ఖాయం చేశాడు.
4/33 గుజరాత్ టైటాన్స్ తరఫున బౌలింగ్ చేస్తూ సాయి మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేశాడు. అంతకుముందు రషీద్ ఖాన్ (4/24, 4/30) రెండుసార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు.
పంజాబ్ : 20 ఓవర్లలో 142 ఆలౌట్ (ప్రభ్‌సిమ్రన్ 35, బ్రర్ 29, సాయి 4/33, నూర్ 2/20).
గుజరాత్ : 19.1 ఓవర్లలో 146/7 (తెవాటియా 36 నాటౌట్, గిల్ 35, హర్షల్ 3/15, లివింగ్‌స్టోన్ 2/19)