IPL | కోల్‌కతా: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. ఒక మ్యాచ్ గెలుస్తూ, మరో మ్యాచ్‌లో ఓడుతున్న కోల్‌కతా మళ్లీ అదే పంథాను అనుసరించింది. సొంత ఇలాఖాలో కోల్‌కతాకు మరోమారు చుక్కెదురైంది. సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్(జీటీ) 39 పరుగుల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 90, 10ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు సాయి సుదర్శన్(36 బంతుల్లో 52, 6ఫోర్లు, సిక్స్) సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్ 20 ఓవర్లలో 198/3 స్కోరు చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అరోరా, రానా, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. కెప్టెన్ రహానే(50) అర్ధసెంచరీ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్‌ఖాన్ రెండేసి వికెట్లతో కోల్‌కతా పతనంలో కీలకమయ్యారు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి రహానేకు పెద్దగా సమయం పట్టలేదు. బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కోల్‌కతా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ద్వయం బౌండరీలతో విజృంభించారు. ఆరోరా మూడో ఓవర్లో సుదర్శన్ రెండు ఫోర్లతో చెలరేగగా, మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు గిల్ కూడా చెలరేగాడు.
రానాను లక్ష్యంగా చేసుకుంటూ ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ కోల్పోకుండా 45 పరుగులు చేసింది. ఎక్కడా జోరు తగ్గించని గిల్..అలీ వేసిన 7వ ఓవర్లో వరుసగా 6,4, 4 బాదడంతో 17 పరుగులు వచ్చి చేరాయి. బౌలింగ్ మార్పుగా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని గిల్, సుదర్శన్ విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు.
బంతి తేడాతో గిల్, సుదర్శన్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నారు. ఇన్నింగ్స్ దూసుకెళుతున్న తరుణంలో సుదర్శన్‌ను రస్సెల్ ఔట్ చేసి కోల్‌కతాకు బ్రేక్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌నకు బ్రేక్‌పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్(41 నాటౌట్)..గిల్‌కు జతకలిశాడు. బట్లర్‌ను అండగా చేసుకుంటూ గిల్ మరింత చెలరేగాడు. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. 18వ ఓవర్లో గిల్ ఔట్ కావడం, ఆ వెంటనే రాహుల్ తెవాటియా(0)కూడా పెవిలియన్ చేరారు. ఆఖర్లో బట్లర్, షారుఖ్‌ఖాన్(11 నాటౌట్) బ్యాట్లు ఝులిపించడంలో విఫలం కావడంతో ఆఖరి 5 ఓవర్లలో గుజరాత్ 59 పరుగులకే పరిమితమైంది.
నిర్దేశిత లక్ష్యఛేదనలో కోల్‌కతా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న వికెట్‌కీపర్, బ్యాటర్ గుర్బాజ్( 1) ఘోరంగా విఫలం కాగా, నరైన్ (17), వెంకటేశ్ (14), రింకూసింగ్ (17), రస్సెల్ (21), రమణ్‌దీప్‌సింగ్(1), అలీ(0) తీవ్రంగా నిరాశపరిచారు. చెత్త షాట్లకు పోయిన కోల్‌కతా బ్యాటర్లు మూ ల్యం చెల్లించుకున్నారు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో సాధించాల్సిన రన్‌రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇదే అదనుగా గుజరాత్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో కోల్‌కతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ఆఖర్లో రఘువంశీ(27 నాటౌట్) ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
గుజరాత్: 20 ఓవర్లలో 198/3(గిల్ 90, సుదర్శన్ 52, రస్సెల్ 1/13, అరోరా 1/44), కోల్‌కతా: 20 ఓవర్లలో 159/8(రహానే 55, రఘువంశీ 27 నాటౌ, ప్రసిద్ధ్ 2/25, రషీద్ 2/25)