ముంబై: తొలిరోజు లో స్కోరింగ్ మ్యాచ్‌తో ఆరంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్లో రెండో రోజు పరుగుల వరద పారింది. గత మూడు సీజన్లలో తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్.. 2026లో మాత్రం గెలుపుతో బోణీ కొట్టింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ వేదికగా యూపీ వారియర్స్‌తో చివరి బంతి దాకా ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో గుజరాత్ జట్టు 10 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. తొలుత సారథి ఆష్లే గార్డ్నర్ (41 బంతుల్లో 65, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అనుష్క శర్మ (30 బంతుల్లో 44, 7 ఫోర్లు) మెరుపులకు తోడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జార్జియా వర్హెమ్ (10 బంతుల్లో 27 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుతో 20 ఓవర్లకు ఆ జట్టు 207/4 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం ఛేదనలో యూపీ గెలుపు కోసం తుదికంటా పోరాడినా ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 197/8 వద్దే ఆగిపోయింది. ఫొబె లిచ్‌ఫీల్డ్ (40 బంతుల్లో 78, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) యూపీని గెలిపించేందుకు శాయశక్తులా పోరాడినా ఆమెకు అండగా నిలిచేవారు కరువవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బ్యాట్‌తో రాణించిన వర్హెమ్.. బంతి (2/30)తోనూ యూపీని దెబ్బకొట్టింది.
రికార్డు ఛేదనలో యూపీ 3 రన్స్‌కే కిరణ్ నవ్గిరె (1) వికెట్ కోల్పోయినా కెప్టెన్ లానింగ్ (30), లిచ్‌ఫీల్డ్ దూకుడుగా ఆడారు. ఆసీస్ సంచలనం లిచ్‌ఫీల్డ్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో యూపీ 8 ఓవర్లకు 68 పరుగులతో పటిష్టంగానే ఉంది. కానీ 9వ ఓవర్లో వర్హెమ్.. 3 బంతుల వ్యవధిలో లానింగ్, హర్లీన్‌ను ఔట్ చేసి యూపీకి షాకిచ్చింది. రెండో స్పెల్‌లో రేణుకా.. దీప్తి (1)ని పెవిలియన్‌కు పంపడంతో యూపీ కష్టాలు రెట్టింపయ్యాయి. కానీ శ్వేత సెహ్రావత్ (25)తో కలిసి 39 బంతుల్లోనే 69 రన్స్ జోడించిన లిచ్‌ఫీల్డ్ వారియర్స్‌లో గెలుపు ఆశలు నింపింది. 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన ఆమె.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడింది. గెలుపు దిశగా సాగుతున్న యూపీకి రాజేశ్వరి గైక్వాడ్.. 15వ ఓవర్లో శ్వేతను ఔట్ చేసి షాకిచ్చింది. ఆ తర్వాతి ఓవర్లోనే డివైన్.. లిచ్ఫీల్డ్నూ వికెట్ల ముందు బలిగొంది. ఆఖర్లో ఆశా శోభ (10 బంతుల్లో 27*, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఆ జట్టును గెలిపించలేకపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇన్నింగ్స్‌ను 4 ఓవర్లలో 40/0తో ధాటిగానే ఆరంభించింది. కానీ ఎకిల్స్టొన్.. మూనీ (13) ఔట్ చేసి యూపీకి తొలి బ్రేక్ ఇచ్చింది. తర్వాతి ఓవర్లోనే శిఖా.. డివైన్‌ను వెనక్కి పంపినా అనుష్క, గార్డ్నర్ దూకుడుగా ఆడారు. అనుష్క బౌండరీలతో చెలరేగగా క్రీజులో కుదురుకున్నాక గార్డ్నర్ బ్యాట్‌కు పనిచెప్పింది. క్రాంతి 13వ ఓవర్లో 3 బౌండరీలు బాదిన ఆమె శోభన ఓవర్లో 6,6 తో రెచ్చిపోయింది. ఎకిల్స్టొన్ ఓవర్లో 6,4తో 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసింది. 3వ వికెట్‌కు శతాధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీని 17వ ఓవర్లో డాటిన్ విడదీసింది. వేగంగా ఆడే క్రమంలో గార్డ్నర్ కూడా నిష్క్రమించినా ఆఖర్లో వర్హెమ్ మెరుపులతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటింది.
గుజరాత్: 20 ఓవర్లలో 207/4 (గార్డ్నర్ 65, అనుష్క 44, సోఫీ 2/32, శిఖా 1/29) యూపీ: 20 ఓవర్లలో 197/8 (లిచ్‌ఫీల్డ్ 78, లానింగ్ 30, రేణుకా 2/25, వర్హెమ్ 2/30)