ఐపీఎల్లో మరో అద్భుత పోరాటం. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోరు ఆద్యంతం ఆకట్టుకుంది. టైటాన్స్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఒక దశలో 105/1 మెరుగ్గా కనిపించిన లక్నో..మోహిత్‌శర్మ వేసిన 20వ ఓవర్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. అర్ధసెంచరీతో జట్టును గెలిపిస్తాడనుకున్న కెప్టెన్ రాహుల్‌తో పాటు స్టొయినిస్, అయూష్ బదోనీ, దీపక్ హుడాను పెవిలియన్ పంపిన మోహిత్.. టైటాన్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. మోహిత్ మాయాజాలంతో లక్నో నుంచి మ్యాచ్‌ను గుజరాత్ గుంజేసుకుంది
లక్నో: ఐపీఎల్లో ప్రతీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. అభిమానుల టిక్కెట్ ధరకు న్యాయం చేస్తూ జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. శనివారం డబుల్ హెడర్‌లో జరిగిన తొలి మ్యాచ్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. పోరాటాన్ని నమ్ముకున్న టైటాన్స్ విజయం వైపు నిలువగా, అతివిశ్వాసానికి పోయిన లక్నో అనుకోని ఓటమిని ఆహ్వానించింది. సొంతగడ్డపై టైటాన్స్‌ను నిలువరిద్దామనుకున్న సూపర్‌జెయింట్స్‌కు నిరాశే ఎదురైంది. బౌలింగ్‌తో టైటాన్స్‌కు స్వల్ప స్కోరుకే కట్టడి చేశామని సంబురపడ్డ లక్నోకు బ్యాటర్ల వైఫల్యం రూపంలో దురదృష్టం నీడలా వెంటాడింది. తొలుత కృనాల్ పాండ్యా(2/16), మార్కస్ స్టొయినిస్(2/20) ధాటికి గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 135/6 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(50 బంతుల్లో 66, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), సాహా(47) రాణించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 128/7 చాపచుట్టేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(68) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. మోహిత్‌శర్మ(2/17), నూర్ అహ్మద్(2/18) రెండేసి వికెట్లు తీశారు. పొదుపైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకమైన మోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మోహిత్ మ్యాజిక్ : లక్నో విజయానికి ఆరు బంతుల్లో 12 పరుగులు అవసరం. క్రీజులో రాహుల్‌తో పాటు ఆయూశ్ బదోనీ ఉన్నారు. తొలి బంతికి రాహుల్ రెండు పరుగులు తీశాడు. స్లో గా వేసిన రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్..జయంత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే స్టొయినిస్(0)అలా వచ్చి ఇలా వెళ్లాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో లాంగ్‌ఆన్‌లో మిల్లర్ క్యాచ్‌తో రాహుల్‌ను అనుసరించాడు. మూడో బంతిని ఆడిన దీపక్ హుడా..రెండో పరుగు కోసం ప్రయత్నించిన బదోనీ..శంకర్ విసిరిన సూపర్ త్రోకు రనౌటయ్యాడు. దీంతో అప్పటి వరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న లక్నో వరుస వికెట్లు కోల్పోవడంతో చేష్టలుడిగిపోయింది. ఐదో బంతికి హుడా కూడా రనౌట్ కావడంతో లక్నో ఓటమి ఖరారైంది. 14 ఓవర్లకు 105/1 మెరుగైన స్థితిలో ఉన్న లక్నోను మోహిత్‌శర్మ, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్(2/18) కళ్లెం వేశారు. అర్ధసెంచరీతో జట్టును గెలిపిస్తాడనుకున్న రాహుల్ భారీ తప్పిదంతో జట్టును ఓటమి వైపు నిలిపాడు. 33 బంతుల్లో తొలి 50 పరుగులు చేసిన రాహుల్..మిగిలిన 18 పరుగుల కోసం 28 బంతులు వృథా చేశాడు. ఇక్కడే లక్నో కొంపమునిగింది.
పాండ్యా ఒక్కడే : టాస్ గెలిచిన టైటాన్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) సీజన్లో తొలిసారి డకౌట్‌గా వెనుదిరుగగా, సాహా(47) సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సాహాతో కలిసి లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక పరుగులు జోడించాడు. కృనాల్ బౌలింగ్‌లో సాహా ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మనోహర్(3), విజయ్‌శంకర్ (10), మిల్లర్(6) నిరాశపరిచారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 135/6 (హార్దిక్ 66, సాహా 47, కృనాల్ 2/16, స్టొయినిస్ 2/20),
లక్నో: 20 ఓవర్లలో 128/7 (రాహుల్ 68, మేయర్స్ 24, మోహిత్ 2/17, నూర్ అహ్మద్ 2/18).