న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్ దొరికింది. ఆసియాకప్‌తో పాటు ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ జట్ల ప్రాతినిధ్యానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో రెండు టోర్నీల్లో పాక్ పోటీ దిగుతుందా లేదా అన్న అనుమానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయాన్ని గురువారం కేంద్ర క్రీడాశాఖ వర్గాలు ధృవీకరించాయి. ఒలింపిక్ చార్టర్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
రాజ్‌గిర్(బీహార్) వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆసియాకప్ జరుగనుండగా, చెన్నై, మధురలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు హాకీ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ‘భారత్‌లో వివిధ దేశాలు పోటీపడే టోర్నీలో ఏ జట్టు అయినా పోటీపడవచ్చు, అందుకు మేం వ్యతిరేకం కాదు. ఒకవేళ పాకిస్థాన్‌ను అడ్డుకుంటే అది కచ్చితంగా ఒలింపిక్ చార్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. భవిష్యత్‌లో పాక్‌లో జరిగే టోర్నీలకు కూడా ఇదే వర్తిస్తుంది.
ద్వైపాక్షిక టోర్నీల విషయంలో ఇరు దేశాల నిర్ణయాలు వేరే ఉండవచ్చు’ అని క్రీడాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే క్రికెట్ సిరీస్‌ల విషయంలో బీసీసీఐ తమను ఇంకా సంప్రదించలేదని, ఒకవేళ కలిస్తే అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటామని అధికారి ఒకరు స్పష్టం చేశారు.