హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జాతీయ స్థాయి పోటీల ద్వారానే దేశ సమైక్యత పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆలిండియా ప్రిజన్స్ 7వ డ్యూటీ మీట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ నిర్వహించేవి ఆటలు మాత్రమే కాదని.. క్రమశిక్షణ, అంకితభావం, స్నేహానికి నిదర్శనమని వీటిని ఒక పండుగలా భావించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1,200 మందికి పైగా జైలు సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొనడం ఆనందదాయకమని చెప్పారు. జైళ్లశాఖలో విధులు నిర్వహణ అనేది.. సమాజంలో అత్యంత సవాలుతో కూడిన విషయమన్నారు. భద్రత, క్రమశిక్షణతో పాటు ఖైదీలలో పునరావాసం, పరివర్తనకు కృషి చేయడం చాలా కీలకమని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఈ డ్యూటీ మీట్ జైలు అధికారుల వృత్తి నైపుణ్యం, శారీరక సామర్థ్యం, సృజనాత్మక ప్రతిభను గుర్తించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా మాట్లాడుతూ.. ఈ డ్యూటీ మీట్ జైలు సిబ్బంది మధ్య ఐక్యత, స్నేహాన్ని పంచే జాతీయ వేదిక అని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ జైళ్లు నిర్బంధ ప్రదేశాలు మాత్రమే కాదని, ఇప్పుడు అవి సంసరణ, పునరావాసం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా కోరారు. భారతదేశంలో తెలంగాణలో చేపట్టిన కారాగార సంసరణల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని చెప్పారు.