హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న అకాడమీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్‌పై చైర్మన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత దశాబ్ద కాలంగా క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్‌పై సాట్స్ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆరు నూతన స్పోర్ట్స్ అకాడమీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
క్రీడా పాఠశాలలు, అకాడమీలపై ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతీ ఏటా ఖర్చు చేస్తున్నది. మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచనల మేరకు క్రీడా, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసంపై నిపుణులతో శిక్షణనిస్తాం. ప్రతీ విద్యార్థి ప్రొఫైల్ తయారు చేసి అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలి. అంతర్గత ఆడిట్ పూర్తిచేసి వివరాలు సమర్పించాలి’ అన్నారు. ఈ సమీక్షలో సాట్స్ అధికారులు పాల్గొన్నారు.