కోల్కతా: భారత ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త! ఆధునిక ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 15 దాకా అతడు భారత్లో పర్యటించనున్నాడు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’ పేరుతో శతద్రు దత్తా.. మెస్సీ కార్యక్రమాలను నిర్వహించనున్నాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నాకు అనుమతి (మెస్సీ పర్యటనపై) లభించింది. ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మెస్సీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ పర్యటనపై అధికారిక ప్రకటన చేస్తాడు’ అని తెలిపాడు.
మెస్సీ భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. గతంలో అతడు 2011లో ఇండియాకు వచ్చాడు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 12న కోల్కతాలో ల్యాండ్ కానున్న ఈ సాకర్ దిగ్గజం.. ఆ నగరంతో పాటు అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. డిసెంబర్ 15న అతడు.. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన తర్వాత తిరిగి స్వదేశానికి పయనమవుతాడు.