శంషాబాద్ రూరల్, డిసెంబర్ 10: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ఎజెండా కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీని భాగస్వామ్య సంస్థగా చేసుకుని ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్‌ను జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
ప్రాజెక్టులో భాగంగా ఆధునిక శిక్షణాకేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన స్టేడియాలు, హై ఫెర్ఫార్మెన్స్, పునరావాస కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్ సదుపాయాలు వంటి వసతులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జీఎంఆర్ స్పోర్ట్స్ చైర్మన్ గ్రంధి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.