IND Vs SA T20 series | దక్షిణాఫ్రికాతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచు టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. టెస్ట్ సిరీస్ సమయంలో గాయపడిన శుభ్‌మన్ గిల్‌కు 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. అయితే, గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది సీఓఈ ఫిట్నెస్ నివేదికపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తేనే టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరాడు.
భారత్, దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడుతున్నాయి. రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రాయ్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతున్నది. ఇక మూడో మ్యాచ్ విశాఖపట్నంలో జరుగనున్నది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి రెండు జట్లు టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 కటక్‌లో జరుగనున్నది. రెండో మ్యాచ్ డిసెంబర్ 11న న్యూ చండీగఢ్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని మిగిలిన మూడు మ్యాచ్‌లు డిసెంబర్ 14, 17, 19 తేదీల్లో ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఇక వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా ఈ టీ20 సిరీస్ టీమిండియాకు కీలకం. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలుకానున్నది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. పొట్టి ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని యోచిస్తున్నది.
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరికి చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చాడు. చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడు. అయితే, పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం మైదానంలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. సెలెక్టర్లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాను చోటు కల్పించారు. అయితే, రింకు సింగ్, యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్‌కు చోటు దక్కలేదు.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.