సింధు, శ్రీకాంత్‌పైనే ఆశలు
న్యూఢిల్లీ: కాస్త విరామం అనంతరం భారత షట్లర్లు తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 జర్మన్ ఓపెన్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్న నేపథ్యంలో లయ అందిపుచ్చుకునేందుకు ఈ టోర్నీ వేదికగా వాడుకోవాలని మన షట్లర్లు చూస్తున్నారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధు తొలి పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది. అంతా అనుకున్నట్లు సాగితే క్వార్టర్ ఫైనల్లో సింధుకు టాప్ సీడ్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ) ఎదురయ్యే అవకాశాలున్నాయి. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌ల్లో వాంగ్‌చెరోన్ (థాయ్‌లాండ్)తో లక్ష్యసేన్.. లావెర్డెజ్ (ఫ్రాన్స్)తో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నారు. కరోనా బారినపడి సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ నుంచి తప్పుకున్న శ్రీకాంత్.. ఈ టోర్నీతో విజయాల పరంపర ప్రారంభించాలని చూస్తున్నాడు. వీరితో పాటు సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, ప్రణయ్.. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్, సిక్కిరెడ్డి-అశ్విని జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.