ముంబై: టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త కెప్టెన్ శుభమన్ గిల్‌తో కలిసి గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాటపై గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న బుమ్రా ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై గంభీర్ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు.
ఈనెల 20 నుంచి లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ ‘ టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడేదానిపై ఒకింత అస్పష్టత నెలకొన్నది. ఐదు మ్యాచ్‌ల్లో ఏ మూడు మ్యాచ్‌లు ఆడుతాడనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బుమ్రా లాంటి కీలక బౌలర్‌ను భర్తీ చేయడం చాలా కష్టం. కానీ మన పేస్ దళం బలంగా ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా ఇదే విషయాన్ని నేను స్పష్టం చేశాను. ఎవరైనా గాయపడి జట్టుకు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లకు మంచి అవకాశం. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మనకు మెరుగైన పేస్ దళం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌లు గెలిపించే సత్తా మన బౌలర్లకు ఉంది. సిరీస్‌లో ప్రాతినిధ్యంపై మేము బుమ్రాతో మాట్లాడాల్సి ఉంది. అతనుంటే సిరీస్ గెలుపు, ఓటములపై కచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది’ అని అన్నాడు.
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ విషాదంపై గంభీర్ స్పందిస్తూ ‘విజయోత్సవ ర్యాలీలపై నాకు అంతగా నమ్మకం లేదు. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత నేను ఇదే స్టేట్మెంట్ ఇచ్చాను. ర్యాలీల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం. స్టేడియం లేదా ఒక నిర్దేశిత ప్రదేశంలో నిర్వహిస్తే బాగుంటుంది’ అని గంభీర్ పేర్కొన్నాడు.