న్యూఢిల్లీ: టీమిండియా మెన్స్ క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir).. కొత్త పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో పర్యటన చేపట్టనున్న ఇండియా ఏ జట్టుకు కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టే ఛాన్ను ఉన్నది. జూన్‌లో సీనియర్ జట్టు కూడా అయిదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే దానికి ముందే ఇండియా ఏ జట్టు ఆ దేశానికి వెళ్లనున్నది. ఇండియా ఏ జట్టుకు నిర్దేశిత కోచ్ లేకపోవడం వల్ల ఆ బాధ్యతలు కూడా గంభీరే చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియా అండర్ 19 జట్టుకు కూడా గంభీరే కోచింగ్ బాధ్యతలు చేపడుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దుబాయ్‌లో ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు నిర్వర్తించాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏడు నెలల్లోనే ఐసీసీ ట్రోఫీని సాధించిన కోచ్‌గా గంభీర్ రికార్డు సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఇండియా ఏ, లేదా అండర్ 19 జట్లకు.. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్లు కోచ్ పాత్రను పోషిస్తుంటారు. ఒకవేళ గంభీర్ కనుక ఆ టూర్‌కు అబ్జర్వర్‌గా వెళ్తే, అప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ .. ఇండియా ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రిజర్వ్ ఆటగాళ్లను గుర్తించే ప్రక్రియలో గంభీర్ .. ఇండియా ఏ టూర్‌కు వెళ్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన తర్వాత బీసీసీఐతో ఈ అంశంపై గంభీర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇండియా ఏ జట్టు ఆటగాళ్లను గంభీర్ పరీక్షించనున్నాడు. ఇండియా ఏ జట్టుతో వీలైనన్ని టూర్లు చేపట్టాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లు కూడా తెలుస్తోంది.