Gautam Gambhir : టీ20ల్లో భారత జట్టు బెంచ్ బలం గట్టిగానే ఉన్నా ఆస్ట్రేలియా పర్యటనలో వారిని ఉపయోగించుకోలేదనేది వాస్తవం. వరుసగా విఫలమవుతున్నా సరే వైస్‌కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు, పేసర్ హర్షిత్ రానా(Harshit Rana)కు ఎక్కువ అవకాశాలివ్వడం తీవ్ర దుమారం రేపింది. కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఉద్దేశపూర్వకంగానే కొందరికి వంత పాడుతున్నారని, మ్యాచ్ విన్నర్లపై కుట్ర పన్నుతున్నారనే వార్తలు వైరలయ్యాయి. తనను లక్ష్యంగా చేసుకొని వ్యాపిస్తున్న ఈ విమర్శలపై కోచ్ గౌతీ స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటన ముగియడంతో నోరు విప్పిన అతడు.. తాను ఎవరిపైనా కుట్ర పన్నడం లేదని పేర్కొన్నాడు.
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా భారత కోచ్ పదవికి ఎంపికైన గౌతం గంభీర్ మొదటి నుంచి తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటలో తుది జట్టు ఎంపికలో కొందరిపై వివక్ష చూపాడని పలువురు అతడిని దుయ్యబట్టారు. అయితే.. తానేమీ ఉద్దేశపూర్వకంగా కొందరు ఆటగాళ్లను బెంచ్ మీద కూర్చోబెట్టడం లేదని చెబుతున్నాడు గంభీర్. ‘స్క్వాడ్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడం శుభపరిణామం. వాళ్లలో 11 మందినే ఎంపిక చేయడం చాలా కష్టమైన పని.
Gautam Gambhir talking about team India’s dressing room atmosphere. pic.twitter.com/GZ3kptavS8
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2025
టీమిండియా కోచ్‌గా నేను ఇప్పుడు ఇదే సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నా. నాణ్యమైన ఆటగాళ్లతో మా బెంచ్ బలం కూడా ద్రుఢంగానే ఉంది. ప్రతిఒక్కరు తుది జట్టులో ఆడేందుకు అర్హులే. అయితే.. మ్యాచ్ కోసం పదకొండు మందినే తీసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్ ఆటగాళ్లను ఎంచకోవడం, ఆరోజుకు మ్యాచ్‌ను విజయంతో ముగించడం ఇదే మాకు ముఖ్యం. కానీ.. ఇదే విషయాన్ని ఎంపికవ్వని క్రికెటర్లకు తెలియజేయడం నాకు పెద్ద సవాల్. ఎందుకు తీసుకోలేదు? అనే విషయాన్ని వారికి స్పష్టంగా, అర్ధమయ్యేలా చెప్పాల్సి వస్తుంది.
కొన్నిసార్లు సుదీర్ఘ సమయం మాట్లాడాల్సి ఉంటుంది. ముక్కుసూటిగా చెప్పడం కోచ్‌గా నాకే కాదు.. ఆటగాళ్లకు కూడా కష్టంగానే అనిపిస్తుంది. నిజాయతీగా ఉంటూ.. మనసులో ఉన్నది మాత్రమే చెబితే ఏ సమస్యా ఉండదు. ఇదే విధానాన్ని నేను అనుసరిస్తున్నా. కానీ, కొందరు లేనిపోనివి అంటగడుతుంటారు. అవేమీ నేను పట్టించుకోను. సహాయక సిబ్బంది గొప్పగా పని చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం స్నేహపూర్వకంగా, పారదర్శకంగా ఉంది. నేను ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సింగ్ రూమ్‌నే కోరుకుంటా’ అని గంభీర్ వెల్లడించాడు.
Gambhir Emphasizes Fitness and Transparency in Team India’s T20 World Cup Preparation#GautamGambhir #T20WorldCup #BCCI #Cricket #TeamIndia pic.twitter.com/TcD33cgHRy
— CricInformer (@CricInformer) November 10, 2025
ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 స్టార్లను పక్కనపెట్టేయడంతో గంభీర్‌ను విమర్శలు ఎదుర్కొన్నాడు. సంజూ శాంసన్ (Sanju Samson)ను బెంచ్‌మీదే ఉంచడం, కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)ను ఒక్క మ్యాచ్‌కే తీసుకోవడం, వికెట్ల వీరుడైన అర్ష్‌దీప్ సింగ్‌ను తొలి రెండు మ్యాచులు ఆడించకపోవడం వంటివి బెడిసికొట్టాయి. విమర్శల దాడితో మేలుకొన్న గౌతీ మూడో టీ20లో అర్ష్‌దీప్, కుల్దీప్ను తీసుకున్నాడు. వీరిద్దరి రాకతో మ్యాచ్‌లో గెలుపొందిన టీమిండియా సిరీస్ సమం చేసింది. నాలుగో మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను కట్టడి చేసిన సూర్యకుమార్ సేన్ ముందంజ వేసింది. నిర్ణయాత్మకమైన ఐదో టీ20 వర్షార్పణం కావడంతో.. 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఆసీస్ టూర్ ముగియడంతో భారత క్రికెటర్లు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు సనద్ధమవుతున్నారు.