Sajana Sajeevan | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ సంచలనాలతో మొదలైంది. యువ, ఔత్సాహిక మహిళా క్రికెటర్లకు వేదికగా మారుతున్న డబ్ల్యూపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసింది. రెండ్రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సజన సజీవన్.. సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించి ఓవర్ నైట్ స్టార్ అయింది. ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 55 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే సజనపైనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఒక్క సిక్సర్‌తో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కేరళ వరదలకు ఇల్లు కొట్టుకుపోయిన స్థితి నుంచి ముంబైని గెలిపించేదాకా సాగిన ఆమె ఆసక్తికర ప్రస్థానంపై కథనం..
ఎవరీ సజనా..?
కేరళలోని వయనాడ్ జిల్లా మనంతవడి గ్రామం సజన సొంతవూరు. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన సజనకు క్రికెట్ పై అమితాసక్తి. చిన్నప్పట్నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నా పేదరికం ఆమెను ఆ దిశగా సాగనివ్వలేదు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. డిగ్రీ చదువుకునే రోజుల్లో కాలేజీ ఫీజులకే ఇబ్బందులు పడిన ఆమెకు.. క్రికెట్ కోచింగ్ తీసుకుని టోర్నమెంట్లు ఆడేంత స్తోమత లేదు.
కొబ్బరి మట్టలే బ్యాట్‌గా..
తన ఆర్థిక స్థితిగతులు ఆమెను క్రికెట్ నుంచి దూరం చేయాలని చూసినా సజన మాత్రం పట్టువిడవలేదు. టోర్నమెంట్లు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆడకపోయినా తమ వ్యవసాయ భూమిలోనే ఆమె ప్రాక్టీస్ చేసింది. కొబ్బరి మట్టలే ఆమెకు బ్యాట్లు అయ్యాయి. ‘మా కుటుంబ ఆదాయం అంతంతమాత్రమే. నేను ఆటో డ్రైవర్‌ను. నా కూతురును టోర్నమెంట్లకు తీసుకెళ్లేంత డబ్బులు నా దగ్గరలేవు. అయినా ఆమె మాత్రం ఈ ఆట పట్ల తనకున్న అభిరుచిని ఎప్పుడూ మానలేదు. మా పొలంలో కొబ్బరి మట్టలతోనే బ్యాట్ తయారుచేసుకుని స్నేహితులు, బంధువులతో కలిసి ఆడేది..’ అని సజన తండ్రి సాజీవన్ చెప్పుకొచ్చాడు.
𝙏𝙃𝙀 𝙎𝙏𝙐𝙁𝙁 𝙊𝙁 𝘿𝙍𝙀𝘼𝙈𝙎 🤩💥
A match-winning six off the first delivery she faced in the #TATAWPL – Take a bow Sajeevan Sajana 🙌🎉#MIvDC #CheerTheW #TATAWPLonJioCinema #TATAWPLonSports18 #HarZubaanParNaamTera #JioCinemaSports pic.twitter.com/z4pNuNtqpg
— JioCinema (@JioCinema) February 23, 2024
బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన గంభీర్..
‘ఒకరోజు ఇక్కడ ఉన్న కృష్ణగిరి స్టేడియంలో మ్యాచ్‌కు అతిథిగా వచ్చిన గౌతం గంభీర్.. ఆయన సైన్ చేసిన ఆటోగ్రాఫ్‌ను బ్యాట్‌గా ఇచ్చాడు. అప్పట్నుంచి సజనకు ఆట మీద మక్కువ పెరిగింది. ఆమెలోని ఆసక్తిని గమనించిన ఎల్సమ్మ బేబీ (పీఈటీ టీచర్) నా కూతురును ప్రోత్సహించింది.. ’అని సాజీవన్ తెలిపాడు. ఎల్సమ్మ ప్రోత్సాహంతో సజనా.. స్థానికంగా ఉన్న టోర్నీలలో ఆడేందుకు వెళ్లేది. దానికి గాను ఆమెకు కొంత నగదు కూడా వచ్చేది. ఒక్కో మ్యాచ్ ఆడినందుకు గాను రూ. 150, రూ. 300, రూ. 900 దాకా సంపాదించేది. ఇక అక్కడ్నుంచి ఆమె పూర్తిగా ఆటపైనే దృష్టిపెట్టింది. కొద్దిరోజుల్లోనే సజన కేరళ స్టేట్ అండర్ – 19 టీమ్‌కు.. అక్కడా నిరూపించుకుని ఇండియా – ఎ లోనూ స్థానం దక్కించుకుంది.
కేరళ వరదల్లో ఇల్లు కోల్పోయి…
క్రికెటర్‌గా కెరీర్ అప్పుడప్పుడే మొదలవుతున్న సజనకు 2018లో ప్రకృతి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఆ ఏడాది కేరళలో ముంచెత్తిన వరదల్లో ఆమె తన ఇంటిని కోల్పోయింది. ఇది ఆమెకు పెద్ద షాక్ కాగా.. ఆ తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆమె ఆర్థిక స్థితి మళ్లీ మొదటికొచ్చింది. గతేడాది మొదలైన డబ్ల్యూపీఎల్‌లో భాగంగా నిర్వహించిన తొలి వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోవడంతో సజనా బాగా నిరాశకు లోనైంది. కాలం కలిసిరాకున్నా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదని ఆమె వ్యక్తిగత కోచ్ కె. రాజగోపాల్ చెప్పుకొచ్చాడు. ‘కేరళ వరదల్లో ఆమె తన ఇంటిని కోల్పోయినా కరోనా వల్ల ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినా ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. గతేడాది డబ్ల్యూపీఎల్ వేలంలో తన పేరు లేకపోవడంతో ఆమె నిరాశకు లోనైంది. కానీ దేశవాళీతో పాటు తనకు అవకాశం వచ్చిన ప్రతిచోట నిరూపించుకుని రెండో వేలంలో ముంబై తరఫున ఎంపికైంది..’ అని ఆయన అన్నాడు.
Sajeevan Sajana, who played a cameo in Prince @Siva_Kartikeyan‘s #Kanaa pic.twitter.com/X7FzHtRWxi
— 𝙰𝙼𝙰𝚁𝙰𝙽 𝕏 (@_Raggy_SK) February 24, 2024
లేడీ పొలార్డ్..
ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి అత్యంత ఒత్తిడిలోనూ సిక్సర్ బాదిన సజనను ముంబై టీమ్ వికెట్ కీపర్ విండీస్ దిగ్గజం, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న కీరన్ పొలార్డ్‌తో పోల్చింది. పొలార్డ్ మాదిరిగానే సజన కూడా ఆల్ రౌండర్‌గానే రాణిస్తోంది. త్వరలోనే భారత జాతీయ జట్టులోకి రావాలని ఆశపడుతున్న ఈ కేరళ అమ్మాయి.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాణిస్తే తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మరో మెట్టు ఎక్కినట్టే..
సజన తమిళ్లో ఒక చిత్రంలోనూ నటించింది. ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించిన ‘కనా’ సినిమాలో ఆమె క్రికెటర్‌గా నటించింది. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులోనూ తీసిన విషయం తెలిసిందే.