Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్ యువకెరటం లియాన్ మర్చండ్ (Leon Marchand) చరిత్ర సృష్టించాడు. ఈత కొలనులో బంగారు చేపగా పేరొందిన మైఖేల్ ఫెల్ఫ్స్(Michael Phelps) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. విశ్వ క్రీడల స్విమ్మింగ్ పోటీల్లో 22 ఏండ్ల మర్చండ్ నాలుగు స్వర్ణాలు గెలుపొందాడు.
శుక్రవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో నంబర్ 1గా నిలిచి నాలుగో గోల్డ్ మెడల్ ముద్దాడాడు. దాంతో, ఈ యువ స్విమ్మర్ విశ్వ క్రీడల్లో పలు రికార్డులను తన పాదక్రాంతం చేసుకున్నాడు. తద్వారా బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫెల్ఫ్స్ 1.54.06 సెకన్లతో నెలకొల్పిన రికార్డును మర్చండ్ బ్రేక్ చేశాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో మర్చండ్ నాలుగు ఈవెంట్లలో పసిడి కాంతులు విరజిమ్మాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200 మీటర్ల బటర్ ఫ్లై, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలోఫ్రాన్స్ స్విమ్మర్ బంగారు పతకం కొల్లగొట్టాడు.
అంతేకాదు ఒలింపిక్స్‌లో పతకం గెలవాలనుకున్న తన తండ్రి గ్జావియర్ (Xavier) కలను నిజం చేశాడు. 1996 అట్లాంటా గేమ్స్‌లో మర్చండ్ తండ్రి ఫైనల్ చేరిన తొలి ఫ్రాన్స్ స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అతడి వారసుడిగా మర్చండ్ ఈత కొలనులో అద్భుతాలు చేస్తూ దేశానికి స్వర్ణ పతకాలు అందిస్తున్నాడు. దాంతో, అందరూ అతడిని ఫ్రెంచ్ మైఖేల్ ఫెల్ఫ్స్ అని పొగిడేస్తున్నారు.