PCB : టీ20 వరల్డ్ కప్ వైఫల్యం నుంచి తేరుకోని పాకిస్థాన్ (Paksitan) స్వదేశంలోనూ వరుస ఓటములు చవిచూస్తోంది. బంగ్లాదేశ్‌పై తొలిసారి టెస్టు సిరీస్ కోల్పోయిన పాక్ ముల్తాన్ టెస్టు (Mulatan Test)లో ఇంగ్లండ్ ధాటికి ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. సొంతగడ్డపై ఆ జట్టుకు ఇది 11వ ఓటమి. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ క్రికెట్‌ను గాడీలో పెట్టేందుకు ప్రక్షాళనకు నడుంబిగించింది. అందులో భాగంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నసెలెక్టర్లపై వేటు వేస్తూ.. కొత్తవాళ్లకు అవకాశమిచ్చింది.
పాకిస్థాన్ క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ సెలెక్షన్ కమిటీలోకి నలుగురు సభ్యులను తీసుకుంది. వీళ్లలో మాజీ అంపైర్ అలీమ్ దార్ (Aleem Dhar) కూడా ఉన్నాడు. అతడితో పాటు మాజీ ఆటగాళ్లు అకీబ్ జావేద్, అజార్ అలీ, హసన్ చీమాలకు పాక్ క్రికెట్ బోర్డు చోటు కల్పించింది. ‘పురుషుల జాతీయ సెలెక్షన్ కమిటీ ఓటింగ్ సభ్యులుగా నలుగురి నియామకానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపింది. అలీమ్ దార్, అకీబ్ జావేద్, అజార్ అలీ, హసన్ చీమాలు ఎంపికయ్యారు’ అని పీసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంపైర్ ప్యానెల్ సభ్యుడిగా అలీమ్ దార్ మంచి పేరు గడించాడు. మైదానంలో కచ్చితమైన నిర్ణయాలతో వివాదరహితుడిగా కెరీర్ ముగించాడు. 132 టెస్టులు, 236 వన్డేలు, 69 టీ20లకు అలీమ్ అంపైరింగ్ చేశాడు. తన సుదీర్ఘ కెరీర్లో మూడు పర్యాయాలు ‘ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుపొందాడు.