US Open 2024 : విధి ఎంత విచిత్రమో చూడండి. ఒకప్పుడు చాంపియన్లుగా ట్రోఫీలు అందుకున్నవాళ్లు ఇప్పుడు సాధారణ ఆటగాళ్లుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించారు. ఒకప్పుడు యూఎస్ ఓపెన్ (US Open) విజేతలైన స్టాన్ వావ్రింకా, డోమినిక్ థీమ్, నవొమి ఒసాకా, బియంకా అండ్రెస్కులు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీళ్లతో కలిపి మొత్తంగా 14 మంది వైల్డ్ కార్డ్ ద్వారా యూఎస్ ఓపెన్‌లో ఆడనున్నారని గురువారం ఆమెరికా టెన్నిస్ సంఘం తెలిపింది.
మరోవైపు ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic), వెండితో మెరిసిన కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz)లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. టెన్నిస్ సీజన్లో చివరిదైన యూఎస్ ఓపెన్ న్యూయార్క్‌లో ఆగస్టు 26న మొదలవ్వనుంది. సెప్టెంబర్ 8వ తేదిన ఫైనల్ మ్యాచ్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.
Past women’s champions Osaka, Andreescu headline 2024 US Open wild cards.https://t.co/sXVa3EWeoj
— US Open Tennis (@usopen) August 14, 2024
పురుషుల సింగిల్స్లు ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించారు. క్రిస్టోఫర్ యుబ్యాంక్స్(అమెరికా), జచారి స్వాజ్డా, లెర్నర్ టియెన్, మాథ్యూ ఫోర్బ్స్, అలెగ్జాండర్ ముల్లెర్(ఫ్రాన్స్), ట్రిస్టన్ స్కూల్‌కేట్(ఆస్ట్రేలియా)లు బరిలోకి దిగుతున్నారు. ఇక రెండుసార్లు యూఎస్ చాంపియన్ అయిన ఒసాకా రెండేండ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడనుంది. కాన్పు కోసం బ్రేక్ తీసుకున్న ఆమె ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది.