KTR | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శరాఘాతంలా తగలకూడని దెబ్బ ఏమీ తగలేదని చెప్పారు. దేశ రాజకీయాలను చూస్తే పదేళ్లకు మించి మూడోసారి కూడా అధికారంలోకి రావడం కష్టతరమైనది అన్నారు. అట్లాంటిది 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చామని.. 2018లో ఇంకో 25 సీట్లు పెంచుకుని 88 సీట్లతో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 39 సీట్లలో గెలిచామని చెప్పారు. ఇదేమీ పెద్ద ఓటమి కాదని.. మూడో వంతు సీట్లు గెలిచామని అన్నారు. ఒక్క 14 సీట్లు కొంచెంలో కోల్పోయామని తెలిపారు.
1100 ఓట్లతో జుక్కల్, 1300 ఓట్లతో దేవర కద్ర పోయిందని అన్నారు. మూడు వేల ఓట్లతో బోధన్, కాగజ్నగర్, ఆదిలాబాద్ పోయాయని అన్నారు. ఐదు, ఆరు వేల ఓట్ల తేడాతో పోయినవే 14 సీట్లు ఉన్నాయని అన్నారు. అందులో సగం గెలిచినా ఇవాళ కథ వేరే ఉండేదని చెప్పారు. దాని గురించి ఇప్పుడు అనుకొని లాభం లేదని అన్నారు. ఏదో జరిగిపోయిందని కొంతమంది బేజారయ్యిండ్రని.. కొంతమంది బాధపడ్డారని.. కొంతమంది కాటగలిశారని కేటీఆర్ అన్నారు. ఈలోపే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో ఒకటే ట్రెండ్ నడిచిందని తెలిపారు. మోదీ ఇష్టం ఉంటే ఎన్డీయేకి.. ఇష్టం లేకపోతే ఇంకో కూటమి వేయాలని అన్నట్టుగానే జరిగాయని అన్నారు. మధ్యలో ఏ కూటమిలో లేని పార్టీలను దేశ ప్రజలు ఆదరించలేదని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ నడిచిందని పేర్కొన్నారు. పంజాబ్లో అకాళీదళ్ రెండు కూటముల్లో లేదని.. వాళ్లకు సీట్లు రాలేదని తెలిపారు. పక్కన ఒడిశాలో బిజూ జనతాదళ్ కూడా రెండు కూటముల్లో లేదని.. దానికి కూడా సీట్లు రాలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మాయవతి బీఎస్పీకి కూడా ఒక్క సీటు రాలేదని అన్నారు. ఇక్కడ మనకు రాలేదని తెలిపారు.
మన కింద ఏపీలో జగన్ కూడా ఏ కూటముల్లో లేడు.. కానీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి రావడంతో ఒక 4 ఎంపీ సీట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఉందని.. అక్కడ కూడా వాళ్లకు ఒక్క సీటు రాలేదని వివరించారు. అదే తమిళనాడులో సీపీఎం కూటమిలో చేరింది.. అక్కడ రెండు ఎంపీ సీట్లు వచ్చాయని అన్నారు. అంటే.. నిట్టనిలువున దేశం చీలిందని అన్నారు. 294 ఒక్క దిక్కు.. 239 ఒక దిక్కు వచ్చాయని.. ఏ కూటమిలో లేనివాళ్లకు కేవలం 18 సీట్లు వచ్చాయని అన్నారు. కాబట్టి మనకు పెద్ద దెబ్బ తగిలిందని బాధపడాల్సిన అవసరం.. భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి కొంతమంది ప్రజలు మోసపోయారని కేటీఆర్ అన్నారు. ఎటుపడితే అటు 420 హామీలు ఇచ్చారని.. మీదకెళ్లి ఆరు గ్యారంటీలు అని ఆగమాగం చేసి కొంతమంది ప్రజలను విజయవంతంగా మోసం చేశారని విమర్శించారు. ఆఖరికి చూస్తే మనకు 39 సీట్లు.. వాళ్లకు 64 సీట్లు వచ్చాయని అన్నారు. మనకు 37 శాతం ఓట్లు వస్తే.. వాళ్లకు 38.5 ఓట్లు వచ్చాయని అంటే కేవలం 1.5 శాతం తేడా మాత్రమే అని చెప్పారు. రాష్ట్రంలో పోలైన ఓట్లతో పోలిస్తే 4 లక్షల తేడా మాత్రమే ఉందని అన్నారు.