కోల్‌కతా: వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మనే భారత సారథిగా కొనసాగాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ తర్వాత నుంచి హిట్‌మ్యాన్ రోహిత్‌తో పాటు.. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో జాతీయ జట్టు తరఫున ఆడటం లేదు. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలో సైతం పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి ఈ ఇద్దరు విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ ఇక వైట్‌బాల్ క్రికెట్ కెప్టెన్సీకి దూరమైనట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దాదా ఈ వ్యాఖ్య చేశాడు. ‘రోహిత్ సమర్థమైన నాయకుడు. అతడి నైపుణ్యం ఏంటో ప్రపంచకప్‌లో అందరూ చూశారు. మూడు ఫార్మాట్లు ఆడితే అన్నీంట్లోనూ అతడే భారత సారథి’ అని గంగూలీ వెల్లడించాడు. ఇక రహానే, పుజారాను దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై కూడా దాదా స్పందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే సమయం ఆసన్నమైందని అన్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం తనను తీవ్రంగా బాధించిందని దాదా పేర్కొన్నాడు.