FIFA World Cup | ఫిఫా ఫుట్బాల్ వరల్డ్కప్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి తుది పోరుకు చేరింది. ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన సెమీస్లో 2-0తో ఫ్రాన్స్ విజయం సాధించింది. జట్టు విజయంతో స్వదేశంలో సంబరాలు మిన్నంటాయి. ఫ్రాన్స్ అభిమానులు పారిస్లో సంబరాలు చేసుకున్నారు. ఆ దేశ జెండాలను ప్రదర్శిస్తూ పారిస్ వీధుల్లో సందడి చేశారు. డ్యాన్స్ చేస్తూ, బాణాసంచా కాల్చారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
ఆధ్యంతం నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో బ్రెజిల్ తర్వాత వరుసగా రెండోసారి ఫైనల్కు చేరిన జట్టుగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. బ్రెజిల్ 2002లో రెండోసారి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది. ఇప్పటికే ఫైనల్ చేరిన అర్జెంటీనాతో ఆదివారం జరుగనున్న తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది.