Goutham Gambhir | దుబాయ్: ఒకే వేదికలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నీ ఆడుతుండటంతో భారత జట్టు ప్రయోజనం పొందుతుందని ఆరోపిస్తున్న విమర్శకులకు టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ‘మాకు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చిన ప్రయోజనం ఏంటి? మేం ఇక్కడ (దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో) మ్యాచ్‌లను ఆడుతున్నా ప్రాక్టీస్ చేసేది మాత్రం ఐసీసీ అకాడమీలోనే. ఇక్కడికి అక్కడికి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి.
ఇతరుల మాదిరిగానే మాక్కూడా దుబాయ్ తటస్థ వేదికే. ఈ టోర్నీకి ముందు చివరిసారి ఇక్కడ భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడిందో కూడా నాకు గుర్తులేదు. కొంతమంది నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్లూ ఎదగాలి కదా!’ అని అన్నాడు. ఈ టోర్నీలో తాము ఇప్పటిదాకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదని, ఫైనల్లో అలాంటి ఆట చూస్తామన్న నమ్మకముందని గంభీర్ తెలిపాడు. మైదానంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటామో ఆఫ్ ఫీల్డ్‌లో అంతే అణుకువగా ఉంటామని చెప్పాడు.