అడిలైడ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా నిష్క్రమణపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 15 ఏండ్ల సుదీర్ఘ కలను సాకారం చేస్తుందనుకున్న భారత్.. అభిమానుల ఆశలను అడిఆశలు చేస్తూ సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించింది. హేల్స్, బట్లర్ విరుచుకుపడ్డ వేళ భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయంతో ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. ‘కలను సాకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియా తీరాలను భారంగా వీడుతున్నాం. గుండెల నిండా నిరాశ కమ్ముకుంది. కానీ జట్టుగా చిరస్మరణీయ క్షణాలను తీసుకెళుతున్నాం. ఇక్కణ్నుంచి మరింత మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం. మాకు మద్దతు ఇచ్చిన ప్రతీ అభిమానికి కృతజ్ఞతలు. జెర్సీ ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గర్వకారణం’ అని రాశాడు.