Rohit Sharma | ముంబై: లియోనల్ మెస్సీ-బార్సిలోనా, క్రిస్టియానో రొనాల్డో-రియల్ మాడ్రిడ్, ధోనీ-చెన్నై సూపర్‌కింగ్స్..ఇదే కోవలో రోహిత్‌శర్మ-ముంబై ఇండియన్స్. ఇవి సూపర్ హిట్ కాంబినేషన్స్. ఈ స్టార్ ప్లేయర్లను వేరే జట్లతో ఊహించుకోవడానికి అభిమానులకు మనసు ఒప్పదు. కానీ కాలానికి తగ్గట్లు మనుషులు మారాలి అన్నట్లు. ముంబైతో రోహిత్12 ఏండ్ల అనుబంధానికి తాజాగా ముగింపు పడింది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, హర్భజన్‌సింగ్ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని ముంబైకి టైటిల్ కరువును రోహిత్‌శర్మ వచ్చి రావడంతోనే తీర్చేశాడు. తన అద్భుత నాయకత్వ పటిమతో పదేండ్ల కాలంలో ముంబైకి ఐదు ఐపీఎల్ టైటిళ్లతో పాటు చాంపియన్స్‌లీగ్ విజేతగా నిలిపి ఔరా అనిపించాడు. సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ముంబైకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన రోహిత్‌ను ఫ్రాంచైజీ పక్కకు తప్పిస్తూ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్‌కు రాంరాం పలుకుతూ హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడంపై సోషల్‌మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌శర్మను తప్పిస్తూ ఫ్రాంచైజీ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత రెండేండ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్ పంచుకుంది. జట్టు ఫెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేలా జయవర్దనే మాట్లాడుతూ ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా..వారసత్వాన్ని కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్ మొగ్గుచూపింది. ఇందులో భాగంగా సచిన్ నుంచి హర్భజన్‌సింగ్, రికీ పాంటింగ్ నుంచి రోహిత్‌శర్మ, ఇప్పుడు రోహిత్ నుంచి హార్దిక్‌కు నాయకత్వ బదిలీ జరిగింది. జట్టును మరింత బలంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రోహిత్ సారథ్యంలో ముంబై అనితర సాధ్యమైన విజయాలు సాధించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతను అద్భుతమైన నాయకత్వ శైలితో జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్సీతో ఐపీఎల్ చరిత్రలో రోహిత్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై సోషల్‌మీడియాలో అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.