Jay Shah | భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటివారితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ను ప్రతిపాదిస్తుందని వస్తున్న వార్తలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించాడు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు బీసీసీఐకి అలాంటి ఆలోచనేదీ లేదని కుండబద్దలు కొట్టాడు. మాజీ క్రికెటర్ల కోసం ఇప్పటికే పలు దేశాలలో లెజెండ్స్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ కూడా నిర్వహించగా ఆ ట్రోఫీని యువరాజ్ నేతృత్వంలోని భారత జట్టు సొంతం చేసుకున్న విషయం విదితమే. జై షా మాట్లాడుతూ.. ‘అవన్నీ పుకార్లు. అలాంటి (లెజెండ్స్ లీగ్) తరహా ప్రతిపాదనేది మా చర్చలోకి రాలేదు. దాని గురించి నాకెవరూ చెప్పలేదు. ఒకవేళ అలాంటి ప్రతిపాదనే వస్తే ఏం చేయాలనేదానిపై నాక్కూడా స్పష్టత లేదు’ అని అన్నాడు.
వాళ్లకు రెస్ట్ ఎందుకంటే..!
ఇక దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ నుంచి భారత సీనియర్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా వంటి క్రికెటర్లకు విశ్రాంతినివ్వడంపైనా జై షా స్పందించాడు. ‘విరాట్, రోహిత్, బుమ్రాను దేశవాళీలో ఆడమని మేం ఒత్తిడి చేయలేం. అది వాళ్లమీద పనిభారాన్ని మరింత పెంచడమే అవుతుంది. జట్టుకు వాళ్లు చాలా కీలకం. ఒకవేళ గాయాల బారిన పడితే అది మొదటికే మోసం. మీరు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చూడండి. అక్కడ సీనియర్ ప్లేయర్లను దేశవాళీలో ఆడించేందుకు ఆయా బోర్డులు సుముఖంగా ఉండవు. మన సీనియర్లను మనం గౌరవించాలి. వాళ్లను పనివాళ్లుగా చూడకూడదు..’ అని చెప్పాడు.
When BCCI secretary Jay Shah was quizzed yesterday during his interaction with TOI’s reporters and editors in Mumbai abt whether the Board was planning to launch a league for retired cricketers, he replied: “It’s fake news. No proposal has been discussed about that” #cricket
— Gaurav Gupta (@toi_gauravG) August 15, 2024
ఇషాన్ ఎంట్రీపై..
బీసీసీఐ కాంట్రాక్టుతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్ దేశవాళీలో ఆడాల్సిందేనని జై షా చెప్పాడు. ఈ విషయంలో బోర్డు చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నాడు. ‘అతడు నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఇషాన్ దేశవాళీలో ఆడాలి’ అని షా స్పష్టం చేశాడు. అంతేగాక ‘నిబంధనల విషయంలో మేం చాలా కఠినంగా ఉండాలి. ఆటగాడు ఎవరైనా సరే రూల్స్‌ను ఫాలో అయ్యేట్టు చర్యలు తీసుకోవాలి. గతంలో రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు మళ్లీ అతడు జాతీయ జట్టులో వచ్చేందుకు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని నేనే స్వయంగా అతడికి ఫోన్ చేశాను’ అని వివరించాడు.