Ricky Ponting : సొంతగడ్డపై మరో 33 రోజుల్లో టీ20 ప్రపంచకప్. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బలమైన స్క్వాడ్‌తోనే బరిలోకి దిగనుంది. కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryakumarYadav) ఫామ్ ఒక్కటే టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోంది. ఆసియా కప్‌తో మొదలు.. ఆస్ట్రేలియా పర్యటన, దక్షిణాఫ్రికా సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు సూర్య. ఈ నేపథ్యంలో మిస్టర్ 360కి ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) మద్దతు పలికాడు. మళ్లీ సూర్య ఫామ్ అందుకుంటాడు. తనదైన స్టయిల్లో రెచ్చిపోతాడు అని పాంటింగ్ అంటున్నాడు.
స్పోర్ట్స్ టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan)తో ఐసీసీ రివ్యూ ఇంటర్వ్యూలో పాంటింగ్ సోమవారం మాట్లాడుతూ భారత సారథికి బాసటగా నిలిచాడు. ఒకప్పుడు తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌలర్లను భయపెట్టిన సూర్య టచ్ కోల్పోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. ‘ఈమధ్య సూర్యకుమార్ యాదవ్ ఆట నాకు పెద్ద సర్ప్రైజ్. పటిష్టమైన టెక్నిక్, నిలకడైన ఆటతో అతడు కొన్నాళ్లుగా టీమిండియాకు టీ20ల్లో ప్రధాన ఆయుధంగా ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు.
అతడు అద్భుతమైన క్రికెటర్. సూర్య గొప్ప క్రికెట్ ఆడడం చూశాను నేను. అప్పుడు అతడు 8, 10 బంతులాడాక తన స్టయిల్ విధ్వంసాన్ని కొనసాగించేవాడు. ట్రావిస్ హెడ్ (Travis Head) మాదిరిగానే సూర్యకు కూడా భయం తెలియదు. ఔట్ అవుతానేమోనని అతడు రిస్కీ షాట్లు ఆడకుండా ఉండడు. అందుకుని భారత కెప్టెన్‌కు నా సలహా ఏంటంటే.. ఔట్ అవుతానేమోనని ఆలోచించకుండా పరుగులు సాధించడం మీద దృష్టి సారించాలి. నీపై నమ్మకంతో ఉండు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాడిగా నిరూపించుకున్నావు. మరోసారి నీ స్టయిల్ విధ్వంసంతో నేను బెస్ట్ అని చాటిచెప్పు’ అని భారత కెప్టెన్‌కు పాంటింగ్ విలువైన సలహా ఇచ్చాడు. గత 19 ఇన్నింగ్స్‌ల్లో సూర్య 218 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.