ఆసియాకప్‌లో దాయాదులు భారత్, పాకిస్థాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాక్‌ను మట్టికరిపించిన టీమ్ఇండియా మూడోసారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది. అయితే భారత్, పాక్ మ్యాచ్‌లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తమకు లబ్ధి పొందాలన్న శక్తులు రెండు దేశాల్లో సమాయత్తమవుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌కు మతం, రాజకీయ రంగు పులమటం నిజంగా అత్యంత విషాదం. భారత్, పాక్ పోరాడటం ఇది కొత్త కాదు, ఆఖరి సారి కాదు. మ్యాచ్ గెలిచినప్పుడు కొందరు విపరీత పోకడలు కనబరుస్తున్నారు.
అసలు ఇంతటి వివాదాలకు కారణమవుతున్న ఆసియాకప్‌లో భారత్ పోటీపడటం, దానికి బీసీసీఐ అభ్యంతరం చెప్పకపోవడం నిజయంగా ఆశ్చర్యం కల్గిస్తున్నది. బీసీసీఐకి కాసుల పంటకు దేశాన్ని కుదువ పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ క్రికెట్‌ను ఎలా శాసిస్తుందో మనం చూస్తున్నదే. కాకపోతే ఇరు దేశాల్లోని కొంత మంది ప్రజలు దీన్ని జీవన్మరణ సమస్య చేయడం దుర్మార్గం. భారత్, పాక్ మధ్య క్రికెట్ వివాదాలు కొత్తవి కావు. పాక్ అనైతికి బౌలింగ్‌కు సమాధానంగా మ్యాచ్‌ను విరమించిన బిషాన్సింగ్ బేడీ గతంలో వార్తల్లో నిలిచాడు. అంపైరింగ్‌లో పాకిస్థాన్ వివాదాలు కొత్తవి కావు.
ఈ మధ్య భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పటికీ గతంలో పాక్ గొప్ప జట్టు అన్న విషయం మర్చిపోరాదు. హఫీజ్‌ఖాన్, మాజీద్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, సర్ఫరాజ్ నవాజ్, జహీర్ అబ్బాస్, మియాందాద్, మదస్సర్ నాజర్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది, సయిద్ అన్వర్, షోయబ్ అక్తర్, అబ్దుల్ ఖాదిర్, ఇంజామాముల్ హక్, యూసుఫ్ యోహనా వంటి హేమాహేమీలు పాక్‌ను బలమైన జట్టుగా మార్చారు. అయితే భారత్‌కు లాలా అమర్నాథ్, గవాస్కర్, కపిల్‌దేవ్, గుండప్ప విశ్వనాథ్, బేడీ, చంద్రశేఖర్, ప్రసన్న లాంటి వారు పాక్‌తో పోరాడారు. ఐపీఎల్ ఆగమనంతో భారత క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి. కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ లాంటి క్రికెటర్ల ఆటతో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.
అంతమాత్రాన పాక్‌పై విజయాన్ని భూతద్దంలో చూడటం సరికాదు. ఇక్కడ భారత ప్రేక్షకులు ఒకటి గుర్తుంచుకోవాలి. బెన్సన్ హెడ్జెస్ వరల్డ్‌కప్ తర్వాత దశాబ్దం పాటు పాక్ చేతిలో ప్రతీసారి ఓటమిపాలయ్యాం. షార్జాలో మియాందాద్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి పాక్‌ను గెలిపించడం ఎవరం మర్చిపోం. ఆ తర్వాత కెనడాలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో తొలిసారి దేబశిష్ మహంతి సూపర్ బౌలింగ్‌తో పాక్‌ను ఓడించాం. కానీ సిరీస్‌ను పాక్ 3-2తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1996 వరల్డ్‌కప్‌లో పాక్‌పై జడేజా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన అభిమానుల మదిలో ఇప్పటికీ మెదలుతూనే ఉంటుంది.
పాకిస్థాన్‌లో లంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ఏ జట్టు అక్కడ ఆడేందుకు ముందుకు రాలేదు. 1992 ప్రపంచకప్ తర్వాత పాక్ మళ్లీ గెలువలేదు. ఇతర క్రీడల్లో భారత్‌పై పాక్ గెలుస్తున్నా..క్రికెట్లో మాత్రం కొందరు యాంకర్లు యుద్ధన్మోదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మైదానంలో రవూఫ్, ఫర్హాన్ రెచ్చగొట్టే విన్యాసాలు ఈ క్రీడకు మచ్చ తెచ్చాయి. భావోద్వేగాలు గురయ్యేది ప్రేక్షకులు తప్ప..నిజమైన ప్లేయర్లకు రాగద్వేషాలు ఉండవు. గతంలో కత్తులు దూసుకున్న ఇమ్రాన్‌ఖాన్, మియాందాద్, జహీర్ అబ్బాస్, ఇంజామాముల్ హక్, గవాస్కర్, సిద్ధు, కపిల్‌దేవ్, గంగూలీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
గతంలో ఒకసారి పాక్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన బాల్థాక్రె…మియాందాద్‌ను తన ఇంటికి ఆహ్వానించాడంటే ఆ అభిమాని ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎన్నో దేశాలు యుద్ధాల్లో తలపడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని క్రీడల్లో విజయం సాధించాలనుకోవడం పొరపాటు. ఏ జట్టు మంచి ఆటను ప్రదర్శిస్తే ఆ రోజు విజయం వారిని వరిస్తుంది. ఆదివారం మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, ఓడినా క్రీడాస్ఫూర్తితో అంగీకరించాలి. అనవసర భావోద్వేగాలు రెచ్చగొట్టవద్దు. క్రికెట్ ఇప్పుడు జెంటిల్మన్ గేమ్ కాదు..ఇప్పుడు మర యంత్రం. మ్యాచ్‌లో అనవసర విషయాలు చొప్పించి, ఉద్రిక్తలు రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు. వారి నుంచి దూరంగా కేవలం క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఎవరు గెలిచినా ఆటకు జై కొట్టాలి. ఇది ఆట మాత్రమే, యుద్ధం కాదు.
– చిత్తలూరి చంద్రశేఖర్