EURO Championship : సాకర్ ప్రేమికులను రంజింపజేసిన యూరో చాంపియన్‌షిప్ (EURO Championship) ముగియడంతో ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను నిర్వాహకులు ప్రకటించారు. మెగా టోర్నీలో ఆద్యంతం అబ్బురపరిచిన 11 మందితో కూడిన జాబితాను వెల్లడించారు. ట్రోఫీ గెలుపొందిన స్పెయిన్ (Spain) నుంచి ఏకంగా ఆరుగురికి ఈ జట్టులో చోటు దక్కడం విశేషం.
యూరో కప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువకెరటం లమినె యమల్ (Lamine Yamal) సైతం ఈ జట్టులో చోటు దక్కించుకన్నాడు. ఫ్రాన్స్ నుంచి ఇద్దరు, రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్, జర్మనీ, స్విట్జర్లాండ్ల నుంచి ఒక్కొక్కరిని నిర్వాహకులు ఎంపిక చేశారు. ఫుట్‌బాల్ స్టార్లు అయిన కిలియన్ ఎంబాపే, జుడె బెల్లింగమ్ల పేర్లు లేకపోవడం గమనార్హం.
👕✨ Introducing the UEFA EURO 2024 Team of the Tournament, as selected by UEFA’s Technical Observer panel.#EURO2024 pic.twitter.com/ITp3ipcWxF
— UEFA EURO 2024 (@EURO2024) July 16, 2024
యూరో టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ : మిక్ మైగ్నన్ (ఫ్రాన్స్), మార్క్ కుకురెల్లా(స్పెయిన్), విల్లియం సలిబా(ఫ్రాన్స్), మాన్యుయెల్ అకంజీ(స్విట్జర్లాండ్), కైల్ వాల్కెర్(ఇంగ్లండ్), డాని ఒల్మొ(స్పెయిన్), రోడ్రి(స్పెయిన్), నికో విలియమ్స్(స్పెయిన్), జమల్ ముసియల(జర్మనీ), లమినె యమల్(స్పెయిన్).
యూరో చాంపియన్‌షిప్‌లో అజేయంగా ఫైనల్ చేరిన స్పెయిన్ టైటిల్ పోరులోనూ రఫ్ఫాడించింది. జూలై 14వ తేదీన ఇంగ్లండ్‌ను 2-1తో స్పెయిన్ మట్టికరిపించింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఇంగ్లీష్ జట్టుకు గుండెకోత మిగిలిస్తూ ట్రోఫీని తన్నుకుపోయింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన 17 ఏండ్ల కుర్రాడు యమల్ ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు అందుకున్నాడు.