Samantha |పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత, ఇప్పుడు మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో నటిస్తూ సుదీర్ఘ విరామం అనంతరం ఆమె బిగ్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వనుంది. సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా, అది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమంత పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించారు. ఓ బస్సులో చీరకట్టుతో, రగ్డ్ అండ్ సీరియస్ లుక్స్‌తో ఫైట్ చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరిచింది.
గతంలో ఎప్పుడు లేని విధంగా సమంత ఈ చిత్రంలో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. సామ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. సాధారణంగా ఆమె నుంచి కనిపించే గ్లామర్‌కు భిన్నంగా, పవర్ఫుల్ యాక్షన్ క్యారెక్టర్లో సమంత కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. టైటిల్ వినడానికి ఫ్యామిలీ టచ్ ఉన్నట్టు అనిపించినా, సినిమా మాత్రం పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత–నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
కథను రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి అందించగా, ఈ సినిమాను త్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే, ‘కాంతారా ఛాప్టర్ 1’ ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. విశేషమేమిటంటే, ‘మా ఇంటి బంగారం’లో సమంత బాడీ డబుల్స్ సహాయం లేకుండానే స్టంట్స్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్షన్ పాత్రలతో మెప్పించిన సమంత, అదే జానర్‌ను ఈ సినిమాతో కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. సమంత చివరిసారిగా 2025లో కామెడీ హారర్ మూవీ ‘శుభం’లో అతిథి పాత్రలో కనిపించగా, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతోంది.