Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నాళ్లుగానో ఈ సినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులు, ప్రీమియర్లతోనే థియేటర్లలో సందడి మొదలుపెట్టారు. డార్లింగ్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. థియేటర్లలో ప్రతి సీన్‌కు చప్పట్లు, విజిల్స్‌తో హోరెత్తిస్తున్నారు.మారుతి మార్క్ కామెడీకి ప్రభాస్ మాస్ ఇమేజ్ జత కావడంతో సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను దక్కించుకుంటోంది.
దీంతో థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు, ఇంకా చూడని వాళ్లలో కూడా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి భారీగా పెరిగింది. ‘ది రాజా సాబ్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అదే ఫార్ములాను అనుసరిస్తే, ‘ది రాజా సాబ్’ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా దక్కించుకుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కొద్ది రోజుల తర్వాత లేదా ఏదైనా పెద్ద పండుగ సందర్భంగా టెలివిజన్ ప్రీమియర్‌ను ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ సినిమా కావడంతో టీవీ ప్రీమియర్కూ మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని ఛానల్ వర్గాలు భావిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొత్తంగా థియేటర్లలో మంచి స్టార్ట్ తీసుకున్న ‘ది రాజా సాబ్’, బాక్సాఫీస్ రన్ తర్వాత ఓటీటీ, టీవీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అదే స్థాయిలో సందడి చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.