టెహ్రాన్: ఇస్లామిక్ సుప్రీంనేత సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాత్రి దేశంలోని పలు నగరాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, రోజు వారీ ఖర్చులు పెరిగిపోవడంతో జనం రోడ్లమీదకు వచ్చేశారు. వీధుల్లో ఖమేనీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక నగరాల్లో జరిగిన నిరసన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. సుప్రీం నేత విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. మాషాద్ నగరంలో కూడా భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాకౌట్ చేపట్టారు. సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీని తొలగించాలని కోరుతూ నిరసనకారులు డిమాండ్ చేశారు. బహిష్కృత యువరాజు రిజా పహలావి ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వీధుల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టాలని రిజా పహలావి తన మద్దతుదారులను కోరారు. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమయంలో ప్రిన్స్ రిజా పహలావి తండ్రి దేశం విడిచి పారిపోయారు.
ఇరాన్లో ఆందోళనలు వరుసగా 12వ రోజు చోటుచేసుకున్నాయి. ఇరానీ కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సుమారు 100 పట్టణాల్లో ఆందోళలు మిన్నంటాయి. 31 ప్రావిన్సుల్లోనూ ప్రజాగ్రహం పెల్లుబికింది. నిరసన ప్రదర్శనల్లో 34 మంది మరణించారని, దాంట్లో అయిదు మంది చిన్నారులు, 8 మంది సెక్యూర్టీ సిబ్బంది ఉన్నట్లు మానవ హక్కుల ఏజెన్సీ పేర్కొన్నది. సుమారు మూడు వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు. నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ మాత్రం 45మంది మృతిచెందినట్లు పేర్కొన్నది. 22 మంది మృతులను గుర్తించినట్లు ప్రభుత్వం చెప్పింది.