England-Team India | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలుచుకున్న టీం ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని చేధించడటంలో టీం ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు.
టీం ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్లలో అభిషేక్ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు, టీం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఏడు బంతుల్లో 14 పరుగులు చేశారు. తిలక్ వర్మ 18, అక్సర్ పటేల్ 15 పరుగులు చేశారు. తర్వాత ధృవ్ జురెల్, మహ్మద్ షమీ బ్యాట్ ఝుళిపించినా ఉపయోగం లేకపోయింది. నిర్దేశిత 20 ఓవర్లకు టీం ఇండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు, జామీ ఓవర్టన్ మూడు వికెట్లు తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓపెనర్లలో బెన్ డకెట్ 28 బంతుల్లో 51 పరుగులు, లియాం లివింగ్ స్టోన్ 24 బంతుల్లో 43 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ జట్టు 171 పరుగులు చేసింది. టీం ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు, హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయ్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు.